by Suryaa Desk | Sat, Nov 23, 2024, 10:01 PM
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద ఆటోను, ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం తాలూకు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్న చంద్రబాబు.. రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కుట్లూరు మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన 12 మంది కూలీలు పనికోసం గార్లదిన్నెకు వచ్చారు. పని పూర్తిచేసుకుని ఆటోలో తిరిగి వెళ్తున్న సమయంలో.. గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు విడిచారు. మరో ఆరుగురికి గాయాలు కాగా.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారికి అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అనంతపురం పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ, డీఎస్పీలు కూడా ఘటనాస్థలికి చేరుకుని.. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అయితే ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన ఏడుగురు చనిపోవటంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పనికోసం పొరుగూరికి వెళ్తే.. ప్రాణాలు లేకుండా వచ్చారంటూ ఆ కుటుంబసభ్యుల వేదనలు మిన్నంటాయి. కుటుంబపెద్దలను కోల్పోయిన కుటుంబాల పరిస్థితి రోడ్డున పడింది. ప్రభుత్వమే వీరిని ఆదుకోవాలంటూ స్థానికులు కోరుతున్నారు.
Latest News