by Suryaa Desk | Sat, Nov 23, 2024, 10:48 PM
మహారాష్ట్రలో అధికార మహాయుతి ఘన విజయం సాధించింది. గత 5 ఏళ్లలో మహారాష్ట్రలో జరిగిన రాజకీయ సంచలనాలు, హైడ్రామాలు.. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా ఓటర్లు ఏ పార్టీకి మెజార్టీ ఇవ్వకపోవడంతో అప్పటివరకు బీజేపీతో ఉన్న శివసేన.. కూటమిని కాదని కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి మహా వికాస్ ఆఘాడీ కూటమిని ఏర్పాటు చేసి.. అధికారంలోకి వచ్చింది. సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే ఎన్నికయ్యారు. ఆ తర్వాత శివసేన పార్టీ నుంచి ఏక్‌నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీతో కలిసి అధికారాన్ని ఏర్పాటు చేసి సీఎం అయ్యారు. ఆ తర్వాత ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్.. బీజేపీ షిండే శివసేనతో కలిసి మహాయుతి కూటమిగా ఏర్పడి.. ఈ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహాయుతి కూటమి గెలుపుకు ప్రధాన కారణం ఒక పథకమేనని ఇప్పుడు మరాఠా రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అదే ముఖ్యమంత్రి లాడ్లీ బెహనా యోజన .
దాదాపు గత 3 ఏళ్లుగా మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు.. ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, నినాదాలు ఈ ఘన విజయానికి దోహదం చేశాయి. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి లాడ్లీ బెహనా యోజన.. మహారాష్ట్ర ఓటర్లను మహాయుతి కూటమికి ఓటేసేలా చేశాయని మహారాష్ట్ర రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ముఖ్యమంత్రి లాడ్లీ బెహనా యోజన పథకం కింద.. అర్హులైన ప్రతీ మహిళలకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం అందించడం ఈ విజయానికి బాగా పనిచేసిందని తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వినిపించే ఏక్‌తో సేఫ్ హై నినాదం బాగా పని చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఓబీసీలు, ఆదివాసీలను విభజిస్తే నష్టం అని బీజేపీ చేసిన ప్రచారం బాగా ప్రజల్లోకి వెళ్లిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక కొన్ని నెలల క్రితం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఈ ముఖ్యమంత్రి లాడ్లీ బెహనా యోజన పథకంతోపాటు మరిన్ని పథకాలను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే 21 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు ఆర్థిక సహాయం చేసేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్.. జులై నెల నుంచే అర్హులైన మహిళల ఖాతాల్లో నెలకు రూ.1500 జమ చేయనున్నట్లు తెలిపారు. దీని కోసం రూ.46 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించినట్లు స్పష్టం చేశారు. ఇక ఈ ఎన్నికల్లో గెలిస్తే.. దాన్ని రూ.2100 చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు గంపగుత్తగా మహాయుతి వైపు నిలబడ్డారని తెలుస్తోంది.
ఇక మహాయుతి కూటమి రైతులకు ఇప్పటికే కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఏడాదికి ఇస్తున్న రూ.12 వేలను.. ఈసారి అధికారంలోకి వస్తే రూ.15 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. దీంతోపాటు పంటలకు కనీస మద్దతు ధరకు అనుబంధంగా రేట్లలో తేడాను 20 శాతం వరకు కవర్ చేసేలా ధరల మద్దతు పథకాన్ని తెస్తామని చెప్పింది. ఇక పేద రైతులకు మేలు చేసేలా అక్షయ అన్నయోజన స్కీమ్‌ను ప్రవేశపెడతామంది. ఇందులో బియ్యం, జొన్నలు, నూనె, ఉప్పు, పంచదార, పసుపు, ఆవాలు, కారం వంటివి నెల నెలా ఇస్తామని తెలిపింది. నదులను మళ్లించి రైతుల పొలాలకు నీరు అందిస్తామని ప్రకటించింది.
Latest News