by Suryaa Desk | Sun, Nov 24, 2024, 03:13 PM
తన ప్రాణాలకు ముప్పు ఏర్పడిన మరుక్షణం అధ్యక్షుడు హత్యకు గురవుతాడని, అందుకోసం పూర్తి ఏర్పాట్లు చేసుకున్నానంటూ ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలు సారా డ్యూటెర్టో చెప్పడం కలకలం రేపుతోంది. ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతుండగా ఆన్‌లైన్ కామెంటర్ ఒకరు ఆమెను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడంతో ఆమె ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థికి చెందిన ప్రదేశంలో ఉన్నారని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలన్న కామెంటర్ వ్యాఖ్యలకు ఆమె ఇలా తీవ్రంగా స్పందించారు. తాను ఎప్పుడైతే హత్యకు గురవుతానో, అప్పుడే అధ్యక్షుడు మాక్రోస్, ఆయన భార్య లీజా, స్పీకర్ మార్టిన్ కూడా హత్యకు గురవుతారని, అందుకోసం ఓ వ్యక్తిని మాట్లాడి పెట్టుకున్నట్టు చెప్పారు. ఇదేమీ జోక్ కాదని, ఆ ముగ్గురినీ చంపేదాకా విశ్రమించకూడదని చెప్పానని, అందుకతడు ఓకే కూడా చెప్పినట్టు పేర్కొన్నారు. అయితే, తన ప్రాణాలకు ఎలాంటి ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు.సారా హెచ్చరికలతో అధ్యక్షుడు మాక్రోస్ సెక్యూరిటీ కమాండ్ అప్రమత్తమైంది. ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. వైస్ ప్రెసిడెంట్ హెచ్చరికలపై దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు పోలీస్ చీఫ్ రోమెల్ ప్రాన్సిస్కో తెలిపారు. దీనిపై సారా కూడా వెంటనే స్పందించారు. వారు ఎంత ఆలోచించినా దానిని వారు పసిగట్టలేరని, తొలుత తన చావుపై దర్యాప్తు మొదలైన తర్వాత, వారి చావులపై దర్యాప్తు మొదలవుతుందంటూ మరోమారు హెచ్చరికలు జారీచేశారు.సారా మరెవరో కాదు, ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టో కుమార్తె. తన వద్ద డెత్ స్క్వాడ్‌లు ఉన్నాయని, నేరగాళ్లను చంపేందుకు వాటిని వాడినట్టు రోడ్రిగో ఇటీవల ఓ విచారణలో వెల్లడించారు. కాగా, ఇటీవల ఫిలిప్పీన్స్ స్పీకర్, అధ్యక్షుడి బంధువులు ఉపాధ్యక్ష కార్యాలయ బడ్జెట్‌పై కోత విధించడమే సారా ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. అధ్యక్షుడి తల నరకాలని తాను ఊహించుకున్నట్టు చెప్పి సంచలనం రేపారు.
Latest News