by Suryaa Desk | Sun, Nov 24, 2024, 06:48 PM
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురి పోలీసులను ఆశ్రయించారు. తన గురించి, దువ్వాడ శ్రీనివాస్ గురించి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారంటూ దివ్వెల మాధురి టెక్కలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జనసేన కార్యకర్తలు తమపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారన్న దివ్వెల మాధురి.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ టెక్కలి పోలీస్ స్టేషన్‌లో సీఐకు ఫిర్యాదు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన దివ్వెల మాధురి.. మహిళలపై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ అసెంబ్లీ వేదికగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద నమ్మకంతోనే తమపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.ఏం చర్యలు తీసుకుంటారనేదీ చూడాలని దివ్వెల మాధురి అభిప్రాయపడ్డారు.
మరోవైపు తన గురించి, దువ్వాడ శ్రీనివాస్ గురించి జనసేన శ్రేణులు చాలా అసభ్యకరంగా పోస్టులు పెట్టారని దివ్వెల మాధురి వాపోయారు. ఆ పోస్టులను చూసి మానసిక వేదనకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ఎప్పుడో రెండేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ గురించి దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కేసు పెట్టారంటూ దివ్వెల మాధురి మండిపడ్డారు. ఇది ఎంతవరకూ సమంజసమంటూ ప్రశ్నించారు. ఈ విషయం గురించి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసి ఆధారాలు అందించామన్న దివ్వెల మాధురి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ నిజాయితీ ఏంటో ఇప్పుడు చూపించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం నేపథ్యంలో దివ్వెల మాధురి పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామంటూ వీరిద్దరూ ప్రకటించారు. దువ్వాడ శ్రీనివాస్ వాణి విడాకుల వ్యవహారం తేలిన తర్వాత.. తాము పెళ్లి చేసుకుంటామని.. అప్పటి వరకూ కలిసే ఉంటామంటూ దివ్వెల మాధురి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే దివ్వెల మాధురిపై తిరుమలలోనూ కేసు నమోదైంది.