by Suryaa Desk | Sun, Nov 24, 2024, 07:14 PM
కదులుతోన్న ఆర్టీసీ బస్సులో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన తిరుపతి జిల్లాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్తోన్న బస్సు ఏర్పేడు సమీపంలోకి వచ్చినప్పుడు ఈ విషాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే బస్సు కండక్టర్ రేణిగుంట వద్ద గుర్తించాడు. బస్సులో వెనుక సీటు సీటు వద్ద హ్యాంగర్‌కు యువకుడు ఉరి వేసుకుని వేలాడుతుండటం అతడు గమనించాడు. వెంటనే డ్రైవర్‌కు విషయం చెప్పి.. బస్సు నిలిపివేయించాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ సమయంలో బస్సులో ముగ్గురు ప్రయాణీకులు మాత్రమే ఉండటం... చివరి సీటులో యువకుడు కూర్చుకోవడంతో అంతగా గమనించలేదు.
కండక్టర్ ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. రేణిగుంట ఆసుపత్రికి తరలించారు మేర్లపాక స్టేజీ వద్ద ఈ యువకుడు ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ఎక్కాడు. మేర్లపాక నుంచి టికెట్ తీసుకున్నట్టు కండక్టర్ తెలిపారు. అయితే, యువకుడు ఎవరు? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై అనుమానాస్పద మరణంగా పోలీసులు కేసు నమోదుచేశారు. దర్యాప్తులో వివరాలు తెలుస్తాయని అన్నారు.
కృష్ణా నదిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
అవనిగెడ్డ నుంచి విజయవాడకు వెళ్తోన్న ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సు అదుపుతప్పి కృష్ణా నదిలోకి దూసుకెళ్లింది. సూపర్ లగ్జరీ బస్సు కరకట్ట నుంచి 15 అడుగల మేర కిందకు వెళ్లిపోయింది. ఈ ఘటన తోట్లవల్లూరు మండలం వల్లూరు-ఐనాపూర్ మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయానికి బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, వారంతా సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.
అనంతపురంలో ఆర్టీసీ బీభత్సం
శనివారం రాత్రి అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసుపల్లి క్రాస్ వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఎనిమిది మృతిచెందారు. పుట్లూరు మండలం ఎల్లుట్ల నుంచి తలగాసుపల్లిలో అరటి తోటలో పని చేసేందుకు 12 మంది కూలీలు ఆటోలో వెళ్లారు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు వారిని మృత్యువు రూపంలో కబళించింది. డ్రైవర్ నిర్లక్ష్యం బస్సు నడిపి.. ఆటోను ఢీ కొట్టడంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. ఒకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో, మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.