by Suryaa Desk | Sun, Nov 24, 2024, 10:25 PM
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే తమ కస్టమర్లకు కీలక హెచ్చరికలు చేసింది. ప్రస్తుతం మార్కెట్లో జరుగుతున్న కొత్త రకం సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లేదా ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం అధికారులం అంటూ మోసగాళ్లు ఫోన్లు చేసిన బెదిరించి డబ్బులు కాజేస్తున్నారని హెచ్చరించింది. కేసులో ఇరుక్కున్నారని లేదా ఆదాయపు పన్ను బకాయిలు ఉన్నాయని పెద్ద మొత్తంలో ఫైన్ కట్టించుకుంటున్నారని పేర్కొంది. జరిమానా కట్టకపోతే చట్టపరంగా చర్యలు ఎదుర్కోవలసి వస్తుందని భయపెట్టి డబ్బులు దండుకుంటున్నట్లు గుర్తు చేసింది.
ఈ మేరకు కస్టమర్లకు మెసేజ్, ఇ-మెయిల్స్ ద్వారా సందేశాలు పంపిస్తోంది. 'ప్రియమైన ఎస్‌బీఐ కస్టమర్లకు.. మోసగాళ్లు సీబీఐ, ఐటీ విభాగం అధికారులుగా మాట్లాడుతూ మిమ్మల్ని భయపెట్టి పెద్ద మొత్తంలో ఫైన్ల కంటాలంటూ మీ వద్ద నుంచి డబ్బులు కాజేయవచ్చు. అలాంటి మోసాల నుంచి అప్రమత్తంగా ఉండాలి.' అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు సూచించింది. సీబీఐ లేదా ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులమంటూ ఫోన్లు వస్తే వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎలాంటి డబ్బులు కట్టొద్దని, వారి గుర్తింపును రుజువు చేసుకున్నాకే తదుపరి నిర్ణయం తీసుకోవాలని కోరింది.
కస్టమర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
సీబీఐ లేదా ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పినప్పుడు ముందుగా చేయాల్సింది కాల్ చేసిన వారి గుర్తింపును వెరిఫై చేసుకోవాలి. అధికారిక సంస్థలు ఎప్పుడూ ఫోన్, ఎస్ఎంఎస్, వీడియో కాల్‌లో సున్నితమైన సమాచారం ఇవ్వాలని కోరవు. ఇలా కోరినట్లయితే వారు ఫేక్ అని నిర్ధారించుకోవాలి. ఫోన్ కాల్, ఎస్ఎంఎస్, వీడియో కాల్ ద్వారా ఎప్పటికీ మీ వ్యక్తిగత, ఆర్థిక వివరాలను అందించవద్దు. ఫోన్ చేసి మీపై కేసు నమోదైందటూ భయపెట్టి వెంటనే డబ్బులు పంపాలని కోరినట్లయితే అనుమానించాలి. చట్టపరమైన సంస్థలు బాధితులకు స్పందించేందుకు కొంత సమయం ఇస్తాయి. వెంటనే డబ్బులు కట్టాలని ఎప్పటికీ కోరవు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అనుమానిత మెసేజ్, ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వెంటనే స్థానిక అధికారులతో పాటు బ్యాంకుకు సమాచారం అందించాలి. అలాగే మీ ఖాతాకు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఏర్పాటు చేసుకోవాలి. స్ట్రాంగ్, యూనిక్ పాస్‌వర్డ్ ఏర్పాటు చేసుకోవాలి.
Latest News