by Suryaa Desk | Mon, Nov 25, 2024, 07:24 AM
స్వార్థ ప్రయోజనంతో పచ్చి అబద్ధాన్ని నిజంలా ప్రచారం చేయడాన్ని ప్రజలెవ్వరూ హర్షించరని, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మంత్రిగా పని చేసినప్పుడు ఇక్కడ ఎలా ఉంది అన్న విషయం ఆయనకు స్పష్టంగా తెలుసని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. గత రెండు రోజలుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలను చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఒంగోలులో వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..... వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ రాష్ట్రానికి అన్ని రంగాల్లో ఎంతో మేలు జరిగింది. రాష్ట్ర విద్యుత్ రంగంలో సెకీతో ఒప్పందం చరిత్రాత్మకం.
అత్యంత తక్కువ రేటుతో సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నాం. దాని వల్ల ఏటా రూ.3700 కోట్ల మేర ఖర్చు తగ్గుతుంది. ఫలితంగా 25 ఏళ్లలో దాదాపు లక్ష కోట్లు ఆదా అవుతాయి. అయినా దానిపై దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు తన హయాంలో చేసిన అన్ని రేట్లతో పోలిస్తే.. ఈ పీపీఏ రేటు దాదాపు సగం ఉంది. దాన్ని కూడా దురుద్దేశంతో తప్పుదోవ పట్టిస్తున్నారు. చంద్రబాబు హయాంలో 2016లో యూనిట్ విద్యుత్‌ను రూ.4.50కి కొనుగోలు చేసేలా ఒప్పందం జరిగితే, అదే జగన్‌గారి ప్రభుత్వం కేవలం రూ.2.48కే యూనిట్ విద్యుత్ కొనుగోలు చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. పైగా చంద్రబాబు హయాంలో ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ వ్యయం అదనంగా ఉంటే, అది జగన్‌గారి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో లేదు. అదంతా బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే జరిగింది.అంత మంచిగా నాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే, మంచిని మంచి అని అంగీకరించని కూటమి ప్రభుత్వంతో ఆయన జత కట్టడం చాలా బాధాకరం అని తెలియజేసారు.
Latest News