by Suryaa Desk | Mon, Nov 25, 2024, 07:31 AM
దేశంలో మత రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయని హేతువాద సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గుమ్మా వీరన్న పేర్కొన్నారు. దేశంలో రాజ్యాంగాన్ని మార్చేసి హిందూ రాష్ట్రంగా మార్చాలని కుటిల ప్రయత్రాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈప్రమాదం నుంచి ప్రజలను కాపాడుకోవాలంటే హేతువాద మానవవాదమే శరణ్యమని పేర్కొన్నారు. ఆదివారం అమలాపురంలోని ఎస్టీయూ జిల్లా శాఖ కార్యాలయంలో హేతువాద సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి డి.రాజశేఖర్ అధ్యక్షతన ఉమ్మడి జిల్లా సభ నిర్వహించారు. ‘మత విశ్వాసాలు-సైన్స్’ అంశంపై జాతీయ అధ్యక్షుడు వీరన్న మాట్లాడారు.
మనుషుల్లో వైజ్ఞానిక వికాసం వస్తేనే హేతుబద్ధంగా ఆలోచించి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మానవ సమాజానికి స్వేచ్ఛ, నైతిక ప్రవర్తన అత్యవసరాలని న్యాయవాది టి.వసంతరావు పేర్కొన్నారు. ‘సనాతన ధర్మం-మానవ ధర్మమా’ అంశంపై ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకోవాలన్నారు. ‘భౌతిక వాస్తవికవాదం-మానవవాదం’ అంశంపై డాక్టర్ వీరన్నతో పాటు జనిపల్లి భీమారావు మాట్లాడారు. ‘విశ్వపరిణామం-జీవపరిణామం’ అంశంపై జాతీయ ప్రధాన కార్యదర్శి మేడూరి సత్యనారాయణ, తోట బాలకృష్ణ మాట్లాడుతూ విశ్వాన్ని అవగాహన చేసుకుంటే అది మనుషుల మధ్య స్వేచ్ఛకు దారితీస్తుందన్నారు. హేతుబద్ధ ఆలోచనలపై డి.రాజశేఖర్, డి.ప్రకాష్ మాట్లాడారు. డాక్టర్ గుమ్మా వీరన్న రచించిన ‘ఆధునిక తెలుగు సాహిత్యంలో అభ్యుదయ ధోరణులు’ గ్రంథాన్ని డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు, మేడూరి సత్యనారాయణ రచించిన పిల్లల పెంపకం పుస్తకాన్ని డాక్టర్ చైతన్యశేఖర్ ఆవిష్కరించారు. ఉమ్మడి జిల్లా మహాసభలో ఎలిజిబెత్‌రాణి, అమలదాసు బాబూరావు, టి.కేశవరావు, కేవీ రమణ పాల్గొన్నారు.
Latest News