by Suryaa Desk | Mon, Nov 25, 2024, 07:33 AM
కార్తీకమాసం.. ఆపై ఆదివారం కావడంతో ఆ కుటుంబం సీతంపేట మన్యం ప్రాంత అందాలను చూసేందుకు బైక్‌పై బయలుదేరారు. దారి పొడవునా కబుర్లు చెప్పుకుంటూ ఎంతో సంతోషంగా అక్కడకు చేరుకున్నారు. అయితే తిరుగు ప్రయాణంలో మాత్రం వారు ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డులో ఓ మలుపు వద్ద బైక్ అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకొండ పట్టణానికి చెందిన దుప్పాడ దుర్గారావు, భారతీ దంపతులు తమ ఇద్దరు పిల్లలు మేఘన,పల్లవిలతో కలిసి ఆదివారం సీతంపేట మండలంలో ఆడలి వ్యూ పాయింట్‌కు చేరుకున్నారు. ఎత్తయిన కొండలు, ప్రకృతి అందాలను తిలకించి సాయంత్రం వరకు అక్కడ కుటుంబమంతా సరదాగా గడిపారు.
ఆ తర్వాత వారు బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. వ్యూ పాయింట్ నుంచి ఘాట్ రోడ్డులో కిందకు దిగుతున్న సమయంలో బిడిందిగూడ గ్రామ సమీపంలో ఉన్న మలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. దీంతో బైక్‌పై ఉన్న నలుగురు పక్కనే ఉన్న స్వల్ప లోయ (ఆరేడు అడుగులు)లోకి జారిపడ్డారు. ఈ ఘటనలో భారతి(33) తలకి తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దుర్గారావుకు తీవ్రగాయలయ్యాయి. చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు 108కు సమాచారం అందించడంతో క్షతగాత్రులను పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిఫర్ చేశారు. మృతురాలు భారతి స్కూల్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ఆమె భర్త దుర్గారావు తాపీమేస్ర్తిగా పనిచేస్తున్నారు. కాగా విషయం తెలిసి పాలకొండలోని ఇందిరా నగర్ కాలనీలో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవగా.. బంధువులు, స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. సీతంపేట ఎస్‌ఐ అమ్మన్నరావు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Latest News