by Suryaa Desk | Mon, Nov 25, 2024, 07:41 AM
సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పు రాజ్యాంగ విరుద్ధమని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా నాయకుడు డీబీ లోక్ ధ్వజమెత్తారు. 2004లో వర్గీకరణ చెల్లదని తీర్పునిచ్చిన సర్వోన్నత న్యాయస్థానమే 2024లో వర్గీకరణ చెల్లుతుందని తీర్పు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధంగా భావిస్తున్నామన్నారు. మాలలకు న్యాయం జరిగేలా ప్రజా ఉద్యమాన్ని చేపట్టేందుకు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ జిల్లా మాల సామాజికవర్గ నాయకుల ఉద్యమ కార్యాచరణ సన్నాహక సమావేశాన్ని అమలాపురం ఈదరపల్లిలోని అంబేడ్కర్ కమ్యూనిటీ హాలులో లోక్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 341ని మార్చాలంటే పార్లమెంటులో చర్చ జరిగి మెజార్టీ సభ్యుల ఆమోదం పొందాలన్నారు. ఎస్సీ కులగణన జరిగిన తర్వాత మాత్రమే వర్గీకరణ అంశంపై మాట్లాడాలని తీర్మానించారు. ఎస్సీ వర్గీకరణ తీరుపై దళిత నాయకులు ఇసుకపట్ల రఘుబాబు, జంగా బాబూరావు, గెడ్డం సురేష్‌బాబు, రేవు తిరుపతిరావు, కోట రామ్మోహనరావు, పొలమూరి మోహన్‌బాబు, పుణ్యమంతుల రజనీ, గొల్లపల్లి డేవిడ్, చింతా రాజబాబు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీలు కోల్పోయిన 22 పథకాలను వెంటనే పునరుద్ధరించాలన్నారు. బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు వర్తింపజే యాలని తీర్మానించారు. కాగ్ అధిపతిగా కె.సంజయ్‌మూర్తి బాధ్యతలు స్వీకరించడం పట్ల జిల్లాలోని 22మండలాల మాల ప్రజాప్రతినిధులు, నాయకులు అభినందనలు తెలిపి హర్షం ప్రకటించారు. త్వరలోనే మాలల సమారాధన నిర్వహించేందుకు నిర్ణయించారు. సమావేశంలో గూటంసాయి, సాధనాల వెంకట్రావు, నెల్లి లక్ష్మీపతి, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, జిత్తుక సత్యనారాయణ, తోటే ప్రతాప్, మట్టా సురేష్, చిలకపాటి శ్రీధర్, గెద్దాడ బుద్ధరాజ్, కొంకి రాజామణి పాల్గొన్నారు.
Latest News