by Suryaa Desk | Mon, Nov 25, 2024, 08:11 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. వరుసగా రెండు నెలలు పింఛన్ తీసుకోకపోయినా.. మూడో నెలలో కలిపి తీసుకునే వెసులుబాటు కల్పించారు. డిసెంబర్ నుంచి ఈ విధానం అమల్లోకి రాబోతోంది.. దీనితో పాటుగా దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఇతర ప్రాంతాల్లో ఉండి చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులు పింఛన్ డబ్బుల్ని అకౌంట్‌లలో జమ చేయాలని నిర్ణయించింది. దివ్యాంగ విద్యార్థులు ప్రతి నెలా పింఛను డబ్బులు తీసుకునేందుకు దూరం నుంచి రావాల్సి వచ్చేది.. అలాగే సెలవు పెట్టి మరి సొంతూరికి వెళ్లాలి.
ఇకపై ఆ అవసరం లేదంటోంది ప్రభుత్వం.. ఇంటికి దూరంగా గురుకులాలు, హాస్టల్స్‌లో ఉండి చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(డీబీటీ) విధానంలో నేరుగా వారి బ్యాంకు అకౌంట్‌లకే ప్రభుత్వం పింఛను డబ్బులు జమ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఆ ప్రక్రియను ప్రారంభించింది. దివ్యాంగ విద్యార్థులు డీబీటీ ద్వారా పింఛను డబ్బులు పొందేందుకు.. తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు అందించాలి.. అలాగే పింఛన్ డబ్బుల్ని అకౌంట్‌లో జమ చేసేందుకు సమ్మతి తెలియజేయాలి.
దివ్యాంగ విద్యార్థులు డీబీటీ ద్వారా పింఛను డబ్బులు అందుకునే నవంబర్ నెల నుంచే వెసులుబాటు కల్పించారు. కానీ చాలా మంది విద్యార్థులకు దీనిపై అవగాహన లేక సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోలేదు. అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. దివ్యాంగ విద్యార్థులు తమ పరిధిలో గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి అక్కడి వెల్ఫేర్ అసిస్టెంట్‌కు స్టడీ సర్టిఫికెట్, బ్యాంకు అకౌంట్, పింఛన్ ఐడీ, ఆధార్ కార్డు జిరాక్సు కాపీ అందించాలని సూచిస్తున్నారు. అనంతరం ఆ దరఖాస్తును ఎంపీడీవో కార్యాలయం నుంచి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు పంపిస్తారు. అక్కడ వారి లాగిన్ నుంచి డీబీటీ ప్రక్రియ పూర్తి చేస్తారని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ప్రతినెలా లబ్ధిదారుడి బ్యాంకు అకౌంట్‌కే నేరుగా పింఛను జమ అవుతుంది. దివ్యాంగ విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు ఎన్టీఆర్ భరోసా పింఛను తీసుకునేవారు మరణిస్తే.. భార్యకు వెంటనే వితంతు పింఛను మంజూరు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదాహరణకు పింఛనుదారుడు నవంబరు 1 తర్వాత మరణిస్తే మరణ ధ్రువీకరణ పత్రాన్ని పింఛనుదారుడి భార్య నవంబరు 15 లోపు గ్రామ, వార్డు సచివాలయాలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు అందజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత 2024, డిసెంబరు 1 నుంచి పింఛన్ మంజూరు చేస్తారు. ఒకవేళ డిసెంబర్ 15 తర్వాత అందజేస్తే.. 2025, జనవరి 1 నుంచి వితంతు పింఛను మంజూరు చేశారు.
Latest News