by Suryaa Desk | Mon, Dec 23, 2024, 02:51 PM
మొదట్లో అమరావతి రాజధానికి అసెంబ్లీలో మద్దతిచ్చు.. తర్వాత ఎన్నికల్లో అమరావతికి కట్టుబడి ఉన్నామని ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చింది వైసీపీ.. అధికార పగ్గాలు చేపట్టగానే అమరావతిని భూస్థాపితం చేయడానికి కంకణం కట్టుకుంది. మూడు రాజధానుల నినాదంతో హడావుడి చేసి అయిదేళ్లు రాష్ట్రానికి అసలు రాజధాని లేకుండా చేసింది. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అమరావతి పనులను వేగవంతం చేస్తుంది. అది మింగుడుపడని వైసీపీ నేతలు మళ్లీ కుట్రలకు తెరలేపుతున్నారా?.. రాష్ట్ర ప్రజలు మూడు రాజధానులను తిరస్కరించినా ఆ పార్టీ నేతలకు బుద్ధి రావడం లేదా? రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని పార్టీల అంగీకారంతో గుంటూరు – విజయవాడ ప్రాంతంలో రాజధాని నిర్మించటానికి నిర్ణయించింది. దానికి అమరావతి అని పేరుపెట్టి.. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభంతో అక్కడ నుంచే పరిపాలన ప్రారంభించింది. అప్పట్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ సైతం ప్రతిపక్ష నేత హోదాలో అమరావతి రాజధానికి మద్దతిచ్చారు. 2019 ఎన్నికల ప్రచారంలో అమరావతే రాజధానికి అనుకూలంగా మాట్లాడిన జగన్ అధికారంలోకి వచ్చారు. తీరా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాక జగన్ వాయిస్ మారిపోయింది. దేశంలో ఏ రాష్ట్రానికీ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయబోతున్నామని ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దాంతో అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన బాట పట్టారు. ఏళ్ల తరబడి వారి ఆందోళనలు చేసినా.. వాటిని వైసీపీ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయాలని విఫలయత్నాలు చేసింది. ఆ క్రమంలో న్యాయపరమైన చిక్కులతో జగన్ సర్కారు మూడు రాజధానుల దిశగా ఒక్క అడుగు కూడా ముందుక వేయలేకపోయింది. వైసీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా తీసేయడం లేదని.. కేవలం పాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ జగన్ సహా మంత్రులు కూడా బల్లగుద్ది మరీ చెప్పారు. అయితే ఆచరణలో అమరావతి అభివృద్దిని పూర్తిగా అటకెక్కించేశారు. పైపెచ్చు రాజధాని భూ సమీకరణలో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని నిరాధార ఆరోపణలు గుప్పించారు. అయిదేళ్లు అధికారంలో ఉన్పప్పటికీ ఆ ఆరోపణల్లో ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. అయినా మూడు రాజధానుల సెంటిమెంట్ తమకు ఎన్నికల్లో ఎన్నికల్లో కలిసి వస్తుందని భావించిన వైసీపీని ప్రజలు చావు దెబ్బ కొట్టారు. ఇక ఇప్పుడు రాజధాని అమరావతిపై వైసీపీ కుట్రలు మళ్లీ మొదలయ్యాయంట. ఎన్డీయే ప్రభుత్వం రాజధాని పనుల్ని శరవేగంగా ముందుకు తీసుకెళుతుండడం మింగుడుపడని వారు మళ్లీ కుయుక్తులు పన్నుతున్నారంట. అమరావతికి మద్దతిచ్చిన పార్టీలకు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టి, మూడు రాజధానుల నినాదాన్ని తిరస్కరించినా వారి వైఖరి మారకపోతుండటం గమనార్హం. అమరావతికి ప్రపంచబ్యాంకు రుణం రాకుండా అడ్డుకునేందుకు మళ్లీ ఫిర్యాదుల పర్వానికి తెరతీశారంట. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు, ఏడీబీ కలసి రూ.15వేల కోట్ల రుణం ఇస్తుండడంతో… గుర్తుతెలియని వ్యక్తుల నుంచి తాజాగా ఈ నెల 18న ప్రపంచబ్యాంకు ఇన్‌స్పెక్షన్ ప్యానల్‌కి ఒక ఫిర్యాదు వెళ్లింది. రాజధాని నిర్మాణానికి భూసమీకరణ చేయడం చట్టవిరుద్ధమని, రైతుల్ని బెదిరించి, భయపెట్టి సంతకాలు చేయించుకున్నారని ఆ ఫిర్యాదులో అసత్య ఆరోపణలు చేశారు. దానివల్ల అక్కడి ప్రజలు జీవనభృతి కోల్పోయారని, ఆహారభద్రతకు విఘాతం కలుగుతోందని, పర్యావరణ, సామాజిక ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రైతులతో అర్థవంతమైన చర్చలు జరపలేదని, సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నిర్మాణ కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014-19 మధ్య కూడా వైసీపీ శక్తులు రాజధానిపై ఇలాంటి కుట్రల్నే అమలు చేశాయి. అప్పట్లో అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు, ఏఐఐబీ కలసి రూ.3,500 కోట్ల రుణం ఇచ్చేందుకు సిద్ధపడగా.. ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. దానిపై అప్పట్లో ప్రపంచబ్యాంకు ఇన్‌స్పెక్షన్ ప్యానల్ ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఆ బృందం పలు దఫాలు రాజధాని ప్రాంతంలో పర్యటించి, రైతులతో సమావేశాలు నిర్వహించి.. అక్కడ ఎలాంటి ఉల్లంఘనలూ లేవని, రైతులు స్వచ్ఛందంగానే భూములిచ్చారని నిగ్గుతేల్చింది. రాజధానికి రుణం ఇచ్చేందుకు అంతా సిద్ధమైన దశలో.. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రుణం అక్కర్లేదని చెప్పేసింది. అమరావతి విధ్వంసానికి కంకణం కట్టుకుని ఐదేళ్లపాటు అనేక కుట్రలు అమలుచేసింది. రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక అమరావతికి మొదటి ప్రాధాన్యమిచ్చి.. నిర్మాణ పనుల్ని వేగంగా పట్టాలెక్కిస్తోంది. కేంద్రం కూడా ముందుకొచ్చి అమరావతికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోంది. అది మింగుపడని వైసీపీ అమరావతి అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగంగా ప్రపంచబ్యాంకుకు మళ్లీ ఫిర్యాదు చేయడం తీవ్ర విమర్శల పాలవుతుంది.
Latest News