by Suryaa Desk | Mon, Dec 23, 2024, 07:53 PM
లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ఓ అధికారి.. వారికి దొరక్కుండా తప్పించుకోడానికి తన చేతిలో ఉన్న నోట్లను గుటుక్కున మింగేశాడు. దీంతో షాకైన ఏసీబీ అధికారులు.. వెంటనే అతడి మింగిన నోట్లను కక్కించారు. విస్తుగొలిపే ఈ ఘటన కర్ణాటకలోని కొప్పళలో డిసెంబరు 21న చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కొప్పళ జిల్లా సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్ దస్తగిరి అలీని ఓ స్వచ్ఛంద సంస్థ అనుమతి పత్రం కోసం సంప్రదించింది. అయితే, తనకు లంచం ఇస్తేనే పని జరుగుతుందని ఆయన చెప్పాడు. ఆ సంస్థ ప్రతినిధి, గడగ జిల్లాకు చెందిన భీమనగౌడ నుంచి రూ.2 వేలు డిమాండ్ చేశాడు.
దీంతో భీమనగౌడ.. లోకాయుక్త అధికారులకు అతడిపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో దస్తగిరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని నిర్ణయించారు. ప్లాన్ ప్రకారం డిసెంబరు 21న భీమనగౌడకు నాలుగు రూ.500 నోట్లు ఇచ్చి ఆఫీసుకు పంపారు. వాటిని దస్తగిరి అలీకి ఇవ్వగా అవి చేతిలో ఉన్న సమయంలోనే లోకాయుక్త ఇన్‌స్పెక్టర్ నాగరత్న టీమ్ ఎంట్రీ ఇచ్చింది. వారిని చూడగానే తన చేతిలో ఉన్న నోట్లను దస్తగిరి ఉండలా చుట్టి మింగేశాడు. అయితే, లోకాయుక్త అధికారులు ఆ నోట్లను కక్కించి.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు... దర్యాప్తు చేపట్టారు. ఈ ఆపరేషన్ రాయచూర్ లోకాయుక్త ఎస్పీ శశిధర్ పర్యవేక్షణలో జరిగింది.
అయితే, గతంలోనూ పలుచోట్ల ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అవినీతి నిరోధక శాఖ అధికారుల నుంచి తప్పించుకోడానికి నోట్లను మింగేయడం, టాయ్‌లెట్ ఫ్లష్‌లో పడేయం చేస్తుంటారు. రెండేళ్ల కిందట మధ్యప్రదేశ్‌లో లంచం డబ్బు తీసుకుంటూ లోకాయుక్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఓ ఉద్యోగి తన చేతిలో ఉన్న నోట్లను నమిలి మింగేశాడు. కట్నీ జిల్లాలోని రెవెన్యూ విభాగానికి చెందిన పట్వారీ గజేంద్రసింగ్ ..ఓ భూమి కేసులో రూ.5వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో అతడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Latest News