by Suryaa Desk | Mon, Dec 23, 2024, 07:54 PM
సామాన్య మానవుడు అయినా దేశాధ్యక్షుడు అయినా కొన్ని కొన్ని తప్పులు చేస్తే అందుకు కచ్చితంగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అవి చాలా చిన్న తప్పులు అయినా సరే పనిష్మెంట్ మాత్రం ఉంటుంది. అలాంటి ఓ తప్పే చేశారు మలేషియా విదేశాంగ మంత్రి మహమ్మద్ హసన్. దాన్ని గుర్తించిన అక్కడి ఆరోగ్యశాఖ మంత్రి.. మహమ్మద్ హసన్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి మరీ జరిమానా విధించారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మలేషియా విదేశాంగ శాఖ మంత్రి మహమ్మద్ హసన్.. నెగెరీ సెంబిలాన్‌లోని వీధి పక్కన ఉన్న ఓ ఫుడ్ స్టాల్‌కు వెళ్లారు. అక్కడే టీ తాగిన తర్వాత తన స్నేహితులతో కలిసి సిగరెట్ కూడా కాల్చారు. అదే సమయంలో అక్కడ ఉన్న పలువురు స్థానికులు ఆయన సిగరెట్ కాలుస్తుండగా ఫొటోలు తీశారు. నిషేధిత ప్రాంతంలో సిగరెట్ తాగుతున్న మంత్రి అంటూ సోషల్ మీడియాలో ఆయన ఫొటోలను పోస్ట్ చేశారు.
అలా ఈ పోస్ట్ ఆరోగ్యశాఖ మంత్రి డుల్కెఫ్లీ అహ్మద్ కంట పడింది. దీంతో ఈ ఫొటోలను రీషేర్ చేస్తూ.. విదేశాంగ మంత్రిని ట్యాగ్ చేశారు. హోటల్స్, రెస్టారెంట్లతో పాటు తినుబండారాల వద్ద ధూమపానం చట్టవిరుద్ధం అని చెప్పుకొచ్చారు. నిషేధిత ప్రాంతంలో మీరు సిగరెట్ కాల్చినందుకు మీరు జరిమానా చెల్లించాలంటూ ఎక్స్ వేధికగానే వివరించారు. అయితే దీనిపై స్పందించిన మహమ్మద్ హసన్.. బహిరంగంగానే క్షమాపణలు చెప్పారు. అలాగే తాను జరిమానా కూడా చెల్లిస్తానని వివరించారు. అయితే ఈ జరిమానా పెద్ద మొత్తంలో ఉండదని కూడా ఆయన స్పష్టం చేశారు.
చట్టం ఎవరికీ చుట్టం కాదంటూ..!
ఎక్స్‌లో జరుగుతున్న ఈ రచ్చ చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. చట్టానికి ఎవరూ చుట్టాలు కారని కొందరు, మంత్రి అయినా వీవీఐపీ అయినా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని మరకొందరు చెప్పుకొస్తున్నారు. ప్రజలకు చెప్పాల్సిన స్థానంలో ఉండి తప్పు చేసే ప్రజాప్రతినిధులకు.. సామాన్యులతో పోలిస్తే కఠినంగా శిక్షలు అమలు చేస్తే మంచిదని మరో నెటిజెన్ తన మనసులోని భావాన్ని వెల్లడించాడు.
గరిష్టంగా లక్ష రూపాయల వరకూ జరిమానా!
ఇదంతా ఎలా ఉన్నా మలేషియా చట్టం ప్రకారం.. నిషేధిత ప్రాంతాల్లో ధూమపానం చేస్తూ పట్టుబడితే.. గరిష్టంగా RM5000 వరకూ జరిమానా విధించవచ్చు. అంటే (సుమారుగా లక్ష రూపాయలు). కానీ మలేషియా మంత్రికి ఎంత జరిమానా విధించారనేది మాత్రం ఇంకా తెలియలేదు.
Latest News