by Suryaa Desk | Mon, Dec 23, 2024, 08:47 PM
2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవలె అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా.. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ కూటమి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకుని.. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఇక జమ్మూ కాశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు గడిచిపోయింది. అయితే ఈ 2 నెలలు దాటినా.. జమ్మూ కాశ్మీర్ ఎమ్మెల్యేలకు ఇప్పటివరకు ఒక్క నెల వేతనం కూడా అందలేదు. అయితే గతంలో ఉన్న నిబంధనలు, చట్టాలు.. ఎమ్మెల్యేలకు జీతాలు ఇచ్చేందుకు సరిపోవని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక జీతాలు అందని విషయం కాస్తా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్ దృష్టికి.. ఎమ్మెల్యేలు తీసుకువెళ్లారు. దీంతో ఎమ్మెల్యేల వేతనాలకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలపై వివరణ కోరుతూ స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి అధికారికంగా ఒక లేఖ రాశారు. ఎమ్మెల్యేల జీతాలకు సంబంధించి అంశంపై వెంటనే ఒక క్లారిటీ ఇవ్వాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి సూచించారు.
అయితే జమ్మూ కాశ్మీర్‌లో ప్రస్తుతం ఉన్న నిబంధనలు సరిపోవని అనుకుంటే.. ఎమ్మెల్యేల జీత భత్యాలను పెంచే బిల్లును ప్రవేశపెట్టే అధికారం శాసనసభకు ఉంటుందని ఆ రాష్ట్ర అధికారిక వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆ రాష్ట్ర అసెంబ్లీ స్వంత చట్టాన్ని రూపొందించే వరకు లెఫ్టినెంట్ గవర్నర్ తప్పనిసరిగా ఎమ్మెల్యేల జీతాలను నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే ఎమ్మెల్యే వేతనాలు, అలవెన్సుల్లో మార్పులను సూచించే అధికారం రాష్ట్ర అసెంబ్లీకి ఉంటుంది.
ఇక 2019లో జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. ఇక సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఒమర్ అబ్దుల్లా.. జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి తీసుకువచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాకు సంబంధించి ఆ రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదించారు.
Latest News