by Suryaa Desk | Mon, Dec 23, 2024, 09:01 PM
పాకిస్తాన్‌తో యుద్ధం చేసి మరీ విడిపోయి దూరంగా ఉంటున్న బంగ్లాదేశ్‌లో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారత్ సాయంతో పాక్‌పై విజయం సాధించిన బంగ్లాదేశ్.. భారత్‌తో సన్నిహితంగా, పాక్‌తో శత్రుత్వంతో ఇన్నేళ్లు కొనసాగింది. కానీ షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి.. ఆమె భారత్‌కు పారిపోయి వచ్చిన తర్వాత అక్కడి పరిస్థితులు పూర్తిగా తలకిందులైపోయాయి. ఇప్పుడు భారత్ పట్ల అక్కసు వెళ్లగక్కుతున్న బంగ్లాదేశ్.. పాకిస్తాన్‌తో చేతులు కలుపుతోంది. ఈ క్రమంలోనే మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంలోని విదేశాంగ విధానంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నడూ లేని విధంగా 53 ఏళ్లలో తొలిసారి గత నెలలో నేరుగా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్‌కు మొట్టమొదటి కార్గో షిప్ చేరుకుంది. తాజాగా ఆదివారం మరో సరకు రవాణా నౌక చిట్టగాంగ్ పోర్టుకు వచ్చింది.
ఈ క్రమంలోనే బంగ్లాదేశ్-పాకిస్తాన్ దేశాల మధ్య రోజురోజుకూ వాణిజ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. పనామా జెండాతో ఉన్న ఆ రెండో షిప్ 811 కంటైనర్లలో సోడాయాష్, మార్బుల్ బ్లాక్, ముడివస్త్రాలు, షుగర్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వంటి వస్తువులను చిట్టగాంగ్‌కు తీసువచ్చిందని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రి మహమ్మద్ యూనస్.. ఈజిప్టులో భేటీ జరిగిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. పాక్-బంగ్లా మధ్య సంబంధాలు బలపడే దిశగా చర్యలు తీసుకోవాలని షహబాజ్ షరీఫ్, మహమ్మద్ యూనస్ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక బంగాళాఖాతంలో చిట్టగాంగ్ పోర్టు వ్యూహాత్మకంగా చాలా కీలకమైంది. షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వంతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా చిట్టగాంగ్ పోర్టుపై భారత్ ఓ కన్నేసి ఉంచేది. దానివల్లే 2004లో 1500 బాక్సుల చైనా ఆయుధాలను స్వాధీనం చేసుకోగలిగింది. అయితే ఆ సరుకు రవాణా వెనక పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ సూత్రధారి అని.. వాటిని భారత్‌లోని ఉల్ఫా ఉగ్రసంస్థకు అందించడం కోసం ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు చిట్టగాంగ్, మోంగ్లా పోర్టులను వినియోగించుకునేందుకు వీలు కల్పించేలా రెండు దేశాల మధ్య ఉన్న షిప్పింగ్ ఒప్పందాన్ని మహ్మద్ యూనస్ ప్రభుత్వం సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.
ఇక షేక్ హసీనా అధికారంలో ఉన్నపుడు పాకిస్తాన్ నుంచి వచ్చే కార్గో నౌకలను తనిఖీ చేయాలనే రూల్ ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం ఆ నిబంధనను ఎత్తేసింది. దీంతో కార్గో తరలింపు పాక్ నౌకలకు మరింత సులభం అయింది. అయితే అప్పట్లో పాక్ నుంచి వచ్చే సరకు మలేషియా, సింగపూర్, శ్రీలంకలో అన్‌లోడ్ చేసేవారు. ఆ తర్వాత ఆ లోడ్‌ను వేరే నౌకల్లోకి ఎక్కించి బంగ్లాకు తీసుకువచ్చేవారు. అయితే ప్రస్తుతం ఆ నిబంధనను ఎత్తివేయడంతో సరకు రవాణా ముసుగులో ఈశాన్య రాష్ట్రాల్లోని వేర్పాటు గ్రూపులకు ఆయుధాలు సరఫరా అయ్యే ఆందోళన వ్యక్తం అవుతోంది.