by Suryaa Desk | Tue, Dec 24, 2024, 05:56 PM
ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడారు. ఏపీ ఫైబర్ నెట్ లో గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని అన్నారు. ఫైబర్ నెట్ నుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అక్రమంగా రూ.1.15 కోట్లు చెల్లించారని తెలిపారు. ఆ డబ్బు తిరిగి ఇచ్చేందుకు 15 రోజుల గడువుతో రామ్ గోపాల్ వర్మకు నోటీసులు కూడా ఇచ్చామని వెల్లడించారు. గడువులోగా డబ్బు చెల్లించకపోతే వర్మపై కేసు పెడతామని స్పష్టం చేశారు. ఫైబర్ నెట్ లో కోట్ల రూపాయల మేర నిధులు దుర్వినియోగం చేశారని జీవీ రెడ్డి తెలిపారు. గత సర్కారు ఏపీఎస్ఎఫ్ఎల్ కు రూ.12 కోట్ల అప్పుతో పాటు, రూ.900 కోట్ల బకాయి పెట్టిందని వెల్లడించారు. ఇక, గత ప్రభుత్వ హయాంలో అర్హత లేని ఫైబర్ నెట్ లో అక్రమంగా నియమించారని జీవీ రెడ్డి ఆరోపించారు. కొందరు ఫైబర్ నెట్ లో అక్రమంగా నియమితులయ్యారని, వారు వైసీపీ నేతల ఇళ్లలో పనులు చేశారని వివరించారు. అక్రమంగా నియమితులైన 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని ప్రకటించారు. అక్రమంగా ఉద్యోగులను నియమించిన వారికి లీగల్ నోటీసులు పంపుతామని, ఎక్కువగా మాట్లాడితే వేతనాల రికవరీ సహా కేసులు కూడా పెడతామని జీవీ రెడ్డి హెచ్చరించారు.
Latest News