by Suryaa Desk | Tue, Dec 24, 2024, 06:50 PM
కేంద్ర ప్రభుత్వం పలు వస్తువులపై విధించే జీఎస్టీపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై సోషల్ మీడియాలో జీఎస్టీ విషయంలో వచ్చే మీమ్స్, ట్రోల్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీలతోపాటు, సామాన్యులు కూడా కొన్ని వస్తువులపై నరేంద్ర మోదీ సర్కార్ విధిస్తున్న జీఎస్టీపై తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కూడా ఇవ్వడం చేతకాని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఉద్యోగ నియామకాల కోసం చేసుకున్న అప్లికేషన్లపై మాత్రం జీఎస్టీని వసూలు చేస్తోందని మండిపడ్డారు.
ఇక నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన అగ్నివీర్ సహా మిగిలిన ఉద్యోగ నియామకాల దరఖాస్తులపైనా 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారని ట్విటర్ వేదికగా ప్రియాంక గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కల్యాణ్ సింగ్ సూపర్ స్పెషాలిటీ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లోని పలు ఉద్యోగాలకు సంబంధించి ఖాళీల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో దరఖాస్తు ఫీజుతో పాటు దానిపై జీఎస్టీ వేయడాన్ని ప్రియాంక గాంధీ వాద్రా ప్రస్తావించారు. నోటిఫికేషన్‌లో అన్ రిజర్వ్‌డ్, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీల అభ్యర్థులకు రూ.1000.. ఎస్సీ/ఎస్టీలకు రూ.600 దరఖాస్తు ఫీజు ఉంది. వీటికి అదనంగా.. దానిపై 18 శాతం జీఎస్టీ కూడా ఉండటం గమనార్హం.
ఈ క్రమంలోనే దానికి సంబంధించిన ఫోటోను ట్వీట్ చేసిన ప్రియాంక గాంధీ.. కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్లపై 18 శాతం జీఎస్టీ వసూలు చేయడం అంటే గాయాలపై ఉప్పు రుద్దడమేనని మండిపడ్డారు. అప్లికేషన్ ఫీజుతోపాటు జీఎస్టీ చెల్లించి.. దరఖాస్తు చేసిన తర్వాత.. ప్రభుత్వ వైఫల్యం వల్ల పేపర్ లీక్ అయితే.. అవినీతి జరిగితే.. నిరుద్యోగ యువత కష్టపడి చెల్లించిన ఆ డబ్బు వృథా అవుతుందని ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పిల్లలను చదివించేందుకు.. వారి తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతున్నారని.. చివరికి వారిని పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రతి పైసా పొదుపు చేస్తుంటే.. బీజేపీ ప్రభుత్వం మాత్రం వారి కలలను ఆదాయ వనరుగా మార్చుకుందని మండిపడ్డారు.
Latest News