by Suryaa Desk | Tue, Dec 24, 2024, 06:55 PM
కొన్ని చిన్న చిన్న గొడవలే ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తాయి. మరికొన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తాయి. ఇంకొన్ని గొడవలు.. ఘర్షణలకు దారి తీసి ఆస్పత్రి పాలు చేస్తాయి. ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి జరిగింది. రూ.20 చిప్స్ ప్యాకెట్.. పెద్ద యుద్ధానికి కారణం అయింది. చిప్స్ ప్యాకెట్ విషయంలో రెండు కుటుంబాల మధ్య చెలరేగిన గొడవలో 10 మందికి గాయాలు కాగా.. 30 మంది అరెస్ట్ అయ్యారు. మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
చన్నగిరి తాలూకా హొన్నబాగా గ్రామంలో ఇటీవల కొందరు పిల్లలు.. స్థానికంగా ఉన్న ఓ కిరాణం షాప్‌లో రూ.20 విలవైన చిప్స్ ప్యాకెట్ కొనుగోలు చేశారు. అయితే దాన్ని ఇంటికి వెళ్లి తింటుండగా.. వారి తండ్రి సద్దాం దానిపై ఉన్న తేదీ చూడగా.. గడువు ముగిసింది. దీంతో వెంటనే సద్దాం కుటుంబ సభ్యులు.. ఆ కిరాణం షాప్ ఓనర్ అతీపుల్లాను నిలదీశారు. ఆ చిప్స్ ప్యాకెట్ బదులు వేరే చిప్స్ ప్యాకెట్ ఇవ్వాలని అడిగారు. అందుకు అతీపుల్లా అంగీకరించలేదు. దీంతో గడువు ముగిసిన చిప్స్ ప్యాకెట్ ఎలా విక్రయిస్తావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చిన్నగా ప్రారంభం అయిన గొడవ కాస్తా పెద్దగా అయింది.
దీంతో అతీపుల్లా- సద్దాం ఇరు కుటుంబాలు అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు కుటుంబాలకు చెందిన వారు అక్కడే బాగా తన్నుకున్నారు. ఈ గొడవ అక్కడితో ఆగకుండా.. మధ్య రగడ స్టార్ట్ అయింది. ఇక, ఈ రెండు కుటుంబాల వారు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఇది చాలదన్నట్లు 30 మంది అతీఫుల్లా మనుషులు మరో రెండు వాహనాల్లో వచ్చి సద్దాం కుటుంబ సభ్యులపై దాడి చేశారు. అంతేకాకుండా సద్దాం హోటల్‌లో వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో ఈ ఘటన కాస్తా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.
సద్దాం-అతీపుల్లా ఇరు కుటుంబాలు చన్నగిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఒకరిపై మరోకరు ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే ఈ గొడవ పోలీస్ స్టేషన్‌కు వెళ్లడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే 30 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇక అరెస్ట్ భయంతో పలువురు పరారీలో ఉన్నట్లు చన్నగిరి ఎస్‌ఐ బాలచంద్ర నాయక్ తెలిపారు. ఇక ఆ చిప్స్ ప్యాకెట్ గొడవకు సంబంధించి సద్దాం-అతీపుల్లా కుటుంబాలు ఘర్షణ పడిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇక ఆ వీడియోలు వైరల్ కావడంతో ఒక్క చిప్స్ ప్యాకెట్ కోసం ఇంత పెద్ద గొడవనా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Latest News