by Suryaa Desk | Tue, Dec 24, 2024, 09:06 PM
కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు సిద్ధమవుతున్నారా? 2025లో చేయాల్సిన ఆర్థిక ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారా? అయితే ఒక్క క్షణం ఆగి ఈ విషయాలు తెలుసుకోండి. ఈ ఏడాది చివరిలోపు పూర్తి చేయాల్సిన కొన్ని మనీ, ట్యాక్స్ సంబంధిత పనులు ఉన్నాయి. మనీ, ట్యాక్స్ సంబంధించిన ముఖ్యమైన పనులకుడిసెంబర్ 31, 2024తో గడువు ముగియనుంది. మరి ఆలోపు పూర్తి చేయకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఐటీఆర్ ఫైలింగ్ గడువు..
ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వారు గత ఆర్థిక సంవత్సరం 2023-24 (అసెస్మెంట్ ఇయర్ 2024-25)కి సంబంధించి ఐటీ రిటర్నులు ఫైల్ చేయాలి. అందుకు గడువు జులై 31తోనే ముగిసింది. అయితే, ఇంకా రిటైర్న్స్ ఫైల్ చేయని వారు, ఏవైనా తప్పులు ఉంటే సరి చేసుకునే వారికి రివైజ్డ్ లేదా బిలేటెడ్ ఐటీఆర్ దాఖలు చేసేందుకు డిసెంబర్ 31, 2024 వరకు అవకాశం ఉంటుంది. ఐటీ చట్టం 1961లోని సెక్షన్ 139(4) కింద ఆలస్య ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. ఇందుకు రూ.1000 నుంచి రూ.5 వేల వరకు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. ఈ గడువు దాటితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జైలు శిక్ష సైతం పడే అవకాశం ఉంటుంది.
స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల గడువు..
అధిక వడ్డీ కోసం బ్యాంకుల్లో డిపాజిట్లు చేయాలనుకునే వారికి డిసెంబర్ 31 వరకే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని బ్యాంకులు తీసుకొచ్చిన స్పెషల్ స్కీమ్స్ గడువు ఈనెలాఖరుతో ముగుస్తుంది. అందులో ఐడీబీఐ బ్యాంక్ తీసుకొచ్చిన ఉత్సవ్ ఎఫ్‌డీ ఒకటి. ఈ స్పెషల్ స్కీమ్ 300 రోజులు, 375 రోజులు, 444 రోజులు, 700 రోజుల టెన్యూర్ డిపాజిట్లు అందిస్తోంది.
ఇక పంజాబ్ అండ్ సింధ బ్యాంక్ అందిస్తోన్న స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ గడువు సైతం డిసెంబర్ 31తో ముగియనుంది. 222 రోజుల ఎఫ్‌డీపై 7.20 శాతం వడ్డీ ఇస్తోంది. ఇక 444 రోజుల ఎఫ్‌డీ, 777 రోజుల ఎఫ్‌డీ, 999 రోజుల ఎఫ్‌డీల గడువు ఈనెలాఖరు వరకే ఉంటుంది. గరిష్ఠ వడ్డీ రేటు కోరుకునే వారు ఆయా టెన్యూర్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఛార్జీలు..
ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ఛార్జీలు మారుతున్నాయి. ఫైనాన్స్, వడ్డీ ఛార్జీలు ప్రస్తుతం నెలకు 3.6 శాతంగా ఉన్నాయి. అయితే, ఈ ఛార్జీలను 3.75 శాతానికి సవరించారు. కొత్త ఏడాది నుంచే ఈ ఛార్జీలు అమలులోకి రానున్నాయి.
కార్ల ధరల పెంపు..
కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి బిగ్ అలర్ట్. ఎందుకంటే కొత్త ఏడాది తొలి రోజు నుంచే కార్ల ధరలు పెరుగుతున్నాయి. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, హ్యుందాయ్, నిస్సాన్, కియా వంటి దాదాపు అన్ని కంపెనీలు ధరల పెంపు ప్రకటించాయి. 2 శాతం నుంచి 5 శాతం వరకు ధరలు పెంచుతున్నాయి. డిసెంబర్ 31లోపు కొనుగోలు చేస్తే అదనపు భారాన్ని తప్పించుకోవచ్చు.