by Suryaa Desk | Fri, Jan 24, 2025, 05:09 PM
దావోస్ పర్యటన ముగించుకుని గురువారం అర్దరాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (శుక్రవారం) బిజీబిజీగా గడపనున్నారు. ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులతో ముఖ్యమంత్రి వరస భేటీలు నిర్వహించనున్నారు. జనవరి 31 నుంచి పార్లమెంట్ 2025-26 బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో నిర్మలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. శుక్రవారం ఉదయం 11గంటలకు ఆమెతో సమావేశం అవుతారు. కాగా, ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీకి మరిన్ని నిధులు కేటాయించేలా, గతం కంటే ఎక్కువ ప్రయోజనాలు కలిగేలా చంద్రబాబు పావులు కదపనున్నారు.మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 12 గంటలకు మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశం అవుతారు. ఆ తర్వాత కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని సైతం ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఏపీ రావాల్సిన నిధులు, పలు ప్రాజెక్టుల అంశాలపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చిస్తారు. వరస భేటీలు అనంతరం ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడ విమానాశ్రయానికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు.
Latest News