by Suryaa Desk | Fri, Jan 24, 2025, 05:14 PM
పర్యాటక రంగంలో మోడల్ సిటీగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ వైస్ చైర్‌పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలి సూచించారు. జిల్లాలో పర్యాటక ప్రాజెక్టులు, ప్రణాళికలు, మౌలిక వసతుల ఏర్పాటు, భవిష్యత్తు కార్యాచరణ వంటి అంశాలపై ఆమె వీఎంఆర్‌డీఏ, పర్యాటకం, జీవీఎంసీ, జీసీసీ, విశాఖ పోర్టు, అటవీ శాఖ, హోటళ్ల యజమానులు, టూరిజం కౌన్సిల్ జిల్లా అధికారులతో గురువారం సమీక్షించారు. వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో ఆమ్రపాలి మాట్లాడుతూ, పర్యాటకులకు వసతులు కల్పించే విషయంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటించాలన్నారు. టెంపుల్ టూరిజం, అడ్వంచర్ టూరిజం, ఎకో టూరిజం, వైల్డ్ లైఫ్ టూరిజం, మెడికల్ టూరిజం, క్రూయిజ్ టూరిజం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. క్రూయిజ్ టూరిజానికి అవసరమైన టెర్మినల్‌ను విశాఖపట్నం పోర్టు నిర్మించినందున దానికి తగిన వసతులు సమకూర్చాలని సంబంధిత అధికారులకు సూచించారు. విశాఖ నుంచి భోగాపురం వరకు సువిశాలమైన సముద్రతీరం ఉన్నందున కొత్త బీచ్‌లను అభివృద్ధి చేయాలన్నారు. కంబాలకొండ, గంభీరం, తాటిపూడి రిజర్వాయర్లలో బోటింగ్ అవకాశాలు పరిశీలించాలన్నారు. జూ పార్కుకు అదనపు హంగులు అవసరమని అభిప్రాయపడ్డారు. కొత్త ప్రణాళికలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చూడాలన్నారు. వాటికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు పంపాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు వస్తే ఎక్కువ రోజులు నగరంలో ఉండేలా పర్యాటక అభివృద్ధి జరగాలన్నారు. పర్యాటక ప్రాంతాల్లో అందుబాటులో ఉండేలా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. భద్రతా ప్రమాణాలు కూడా చాలా ముఖ్యమన్నారు.
Latest News