by Suryaa Desk | Fri, Jan 24, 2025, 05:31 PM
ఈ ఏడాది రథసప్తమి ఫిబ్రవరి 4వ తేదీన వచ్చింది. రథ సప్తమికి భక్తులు భారీగా తరలి వచ్చి శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఇందుకు సంబంధించి తిరుమలలో టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆలయంలో చేసిన ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ... రథసప్తమి వేడుకలకు జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులతో పాటు టీటీడీలో అన్ని విభాగాలతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.రథసప్తమి నాడు వాహన సేవలను తిలకించేందుకు రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఏడు వాహనాలపై స్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తారని అన్నారు. పుష్కరణిలో స్వామివారికి చక్రస్నాన మహోత్సవం నిర్వహిస్తారన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రథసప్తమి రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని చెప్పారు. ఫిబ్రవరి 3,4,5వ తేదీల్లో సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేసినట్లు ప్రకటించారు. రథసప్తమి నాడు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.రథ సప్తమి వేడుకలు ఉదయం 5: 30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో మొదలై..రాత్రి 9గంటలకు చంద్రప్రభ వాహన సేవతో ముగుస్తాయని చెప్పారు. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు పంపిణీ చేస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. రథసప్తమికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. గతంలో కంటే ఈ ఏడాది అదనపు బందోబస్త్‌తో భద్రతను ఏర్పాటు చేస్తామన్నారు. వాహన సేవలు చూడటానికి గ్యాలరీల్లోకి భక్తులకు అనుమతి ఉంటుందన్నారు. క్రౌడ్ మేనేజ్‌మెంట్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. వాహన సేవలను చూడటానికి వచ్చే భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు.
Latest News