by Suryaa Desk | Fri, Jan 24, 2025, 08:25 PM
రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు వైకాపారాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి ఈనెల 25న రాజీనామా చేస్తున్నట్టు ట్వీట్ చేశారు.‘‘ఏ రాజకీయ పార్టీలో చేరను. వేరే పదవులు, ప్రయోజనాలు ఆశించి రాజీనామా చేయడం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చేయలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్లిన భారతికి సదా కృతజ్ఞుడిని. జగన్‌కి మంచి జరగాలని కోరుకుంటున్నా’’
‘‘పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్‌గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా.. పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు తొమ్మిదేళ్ల పాటు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ప్రత్యేక ధన్యవాదాలు. తెదేపాతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు. పవన్ కల్యాణ్‌తో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలు, మిత్రులు, సహచరులు, పార్టీ కార్యకర్తలకు.. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి రాజ్యసభ పదవీకాలం 2028 జూన్ వరకు ఉంది. మరో మూడేళ్లు పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా ప్రకటన చేయడం వైకాపాలో కలకలం రేపింది.
Latest News