by Suryaa Desk | Sat, Jan 25, 2025, 03:21 PM
ఉపాధి హామీ పథకంలో పశువుల షెడ్లను నిర్మించేందుకు అనుమతి ఉండటంతో ప్రభుత్వం ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. మొదటగా రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల షెడ్లు నిర్మాణాలకు అన్ని జిల్లాల కలెక్టర్లు పరిపాలన ఆమోదం ఇచ్చారు. రెండు పశువులు కలిగిన పాడి రైతులకు రూ.1.15 లక్షలు, నాలుగు పశువులు కలిగిన వారికి రూ.1.85 లక్షలు, 6 పశువులు కలిగిన వారికి రూ.2.30 లక్షల ఉపాధి మెటీరియల్ నిధులు మంజూరుచేశారు. పశువులతో పాటు 20 మేకలకు షెడ్లు వేసుకునే వారికి రూ.1.30 లక్షలు, 50 మేకలు కలిగిన వారికి రూ.2.30 లక్షలు అందించనున్నారు. అదే విధంగా కోళ్ల ఫారాలకు.. 100 కోళ్లు పెట్టుకున్న వారికి షెడ్డు నిర్మాణానికి రూ.87 వేలు, 200 కోళ్లు పెంచుకునే వారికి రూ.1.32 లక్షలు మంజూరుచేశారు. ఇందులో 10 శాతం రైతులు భరిస్తే, మిగిలిన 90 శాతం ఉపాధి మెటీరియల్ నిధుల నుంచి అందిస్తారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 10 శాతం రైతులు డిపాజిట్ చేస్తేనే పనులు మంజూరు చేసేవారు. అయితే ఈ దఫా ముందుగా పనులు మంజూరుచేసి, రైతులు చెల్లించాల్సిన 10 శాతం వాటా నిర్మాణ ఖర్చులకు వాడుకునేలా వారికే వెసులుబాటు కల్పించారు. ఇందులో కూలీలు చేసే పనులకు ఉపాధి మార్గదర్శకాల ప్రకారం మస్టర్లు నమోదు చేస్తారు.
Latest News