by Suryaa Desk | Sun, Jan 26, 2025, 02:37 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వాడ వాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. గత ప్రభుత్వం భారీ అప్పులు చేసి సమస్యలు సృష్టించిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా ఈ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. స్వర్ణాంధ్ర విజన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలనేదే తమ నినాదమని పేర్కొన్నారు. ప్రభుత్వ పది సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలు సాధిస్తామని ఆయన వివరించారు.
Latest News