by Suryaa Desk | Sun, Jan 26, 2025, 02:43 PM
ఆంధ్రప్రదేశ్‌లో పేద ప్రజలకు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున స్థలాలు అందజేస్తామని తెలిపారు. నిన్న ఆయన విజయవాడలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1.14 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి అయ్యాయని చెప్పారు. ఫిబ్రవరి 1న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తేతలిలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు లబ్దిదారుల చేతికి ఇంటి తాళాలు అందిస్తారని చెప్పారు. అదే రోజు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇళ్లకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయడం జరిగిందన్నారు. పీఎంఏవై కింద ఈ ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రంలో ఏడు లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
Latest News