by Suryaa Desk | Sun, Jan 26, 2025, 06:36 PM
నేడు భారత రిపబ్లిక్ డే (జనవరి 26) సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో నిర్వహించిన పరేడ్ కార్యక్రమం దేశ సమగ్రతను, సత్తాను, సాంస్కృతిక వైవిధ్యాన్ని, రక్షణ రంగ పాటవాన్ని చాటేలా అత్యంత ఘనంగా సాగింది. ఈ రిపబ్లిక్ డే పరేడ్ లో వివిధ రాష్ట్రాల శకటాలు అందరినీ ఆలరించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా శకటం ఈ పరేడ్ లో పాల్గొంది. ఏపీ శకటాన్ని ప్రఖ్యాత ఏటికొప్పాక లక్క బొమ్మల కాన్సెప్ట్ తో రూపొందించారు. ఎటు చూసినా నునుపుగా ఉండేలా తయారు చేసే ఈ లక్క బొమ్మలు సృజనాత్మకతకు మారుపేరులా నిలుస్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా వివిధ సందర్భాల్లో ఏటికొప్పాక బొమ్మల విశిష్టతను కొనియాడారు. దేశ విదేశాల్లో ఎంతో ఖ్యాతి పొందిన ఈ బొమ్మలే కాన్సెప్ట్ గా నేడు ఏపీ శకటం రిపబ్లిక్ డే వేడుకల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఏపీ శకటం ముందు భాగంలో వినాయకుడి బొమ్మ, వెనుకభాగంలో వెంకటేశ్వరస్వామి బొమ్మలు ఏర్పాటు చేశారు. బొమ్మలు బొమ్మలు... ఏటికొప్పాక బొమ్మలు అంటూ సాగే గీతానికి కొందరు కళాకారులు నర్తిస్తుండగా, ఏపీ శకటం ముందుకు సాగిపోయింది.
Latest News