by Suryaa Desk | Sun, Jan 26, 2025, 07:52 PM
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ దాడి కేసులో అరెస్టైన నిందితుడి ఫింగర్ ప్రింట్‌తో సైఫ్ నివాసం నుంచి సేకరించిన 19 నమూనాలతో సరిపోలడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. సైఫ్ ఇంటి నుంచి సేకరించిన నమూనాలను సీఐడీ ఫింగర్ ప్రింట్ బ్యూరోకు ముంబయి పోలీసులు పంపినట్టు తెలిపాయి. మొత్తం 19 నమూనాలను నిందితుడు షరీఫుల్ వేలిముద్రలతో సరిపోల్చగా.. ఏ ఒక్కటీ మ్యాచ్ కాలేదని తెలిసింది. దీంతో మరికొన్ని నమూనాలను పరీక్షల కోసం పోలీసులు సేకరించనున్నారు.
బంగ్లాదేశ్ జాతీయుడు షరీఫుల్ ఫకీర్ (30)ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జనవరి 15న అర్ధరాత్రి సైఫ్ అలీఖాన్ ఇంటిలోకి చొరబడిన నిందితుడు.. ఆయనపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. సైఫ్‌ను ఆరుచోట్ల పొడవ.. వెన్నుముక సమీపంలో బలమైన గాయమైంది. కారు డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో ఆటోలోనే సైఫ్‌ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. కత్తి పోటుకు వెన్నుముక నుంచి ద్రవం కూడా బయటకు వచ్చినట్టు వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న సైఫ్.. గత మంగళవారం ఇంటికి చేరుకున్నారు.
నిందితుడు షరీఫుల్ బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడి.. తన పేరును విజయ్ కుమార్‌గా మార్చుకున్నాడు. అయితే, ఓ వ్యక్తి తనకు నకిలీ పత్రాలతో భారత పౌరసత్వం ఇప్పించడానికి డబ్బులు అడిగాడని, అందుకే సైఫ్ ఇంటికి చోరీకి వెళ్లానని నిందితుడు విచారణలో వెల్లడించారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఎవరు? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
సైఫ్ నివాసంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయిన నిందితుడిని గుర్తించడంలో సహాయం కోసం పశ్చిమ రైల్వేను ముంబయి పోలీసులు సంప్రదించారని ఆ వర్గాలు తెలిపాయి. నిందితుడు బాంద్రా స్టేషన్లో రైలు ఎక్కాడని, రైల్వే ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఉపయోగించి నిందితుడితో సరిపోలిన కొంతమంది అనుమానితులను షార్ట్‌లిస్ట్ చేశాయని తెలిసింది. అనుమానితుడు ఆ భవనం నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు అస్పష్టంగా ఉండటం వల్లే ఇలా జరిగిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా షరీఫుల్‌ను అరెస్టు చేయగా.. కేసులో మరిన్ని బలమైన సాక్ష్యాలను సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు.
Latest News