by Suryaa Desk | Sun, Jan 26, 2025, 07:59 PM
పౌరసరఫరాల సంస్థలో స్టేజ్-1 ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది. ఇప్పటికే రెండుసార్లు నిర్వహించిన టెండర్ల ప్రక్రియ రద్దవగా.. ఇప్పుడు మూడోసారి కూడా రద్దయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాత టెండర్లను ఖరారు చేసిన ధరల కంటే.. తాజాగా కాంట్రాక్టర్లు 15శాతం ఎక్కువగా కోట్ చేశారని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. ఆ రేట్లకే టెండర్లు ఖరారు చేస్తే సంస్థపై దాదాపు రూ.55 కోట్ల మేర అదనపు భారం పడుతుందని పేర్కొంటున్నాయి. దీనిపై కాంట్రాక్టర్లతో చర్చలు జరుపుతున్న అధికారులు... టెండర్లు రద్దు చేసి.. మళ్లీ నాలుగోసారి కొత్తగా పిలిచేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. అయితే గతంలో ఖరారు చేసిన టెండర్ల అసలు రేట్లు, ఇంతకుముందు రద్దు చేసిన టెండర్లలో కాంట్రాక్టర్లు కోట్ చేసిన రేట్లు, తాజా టెండర్లలో కోట్ చేసిన రేట్లు ఎంతనే వివరాలు వెల్లడించకుండా సివిల్ సప్లయిస్ అధికారులు గోప్యత పాటిస్తున్నారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ నిర్వహించే అన్ని టెండర్లలో అతి పెద్దదైన స్టేజ్-1 ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టు విలువ దాదాపు రూ.400 కోట్లు. రెండేళ్ల కాలపరిమితితో పిలిచే ఈ టెండర్లు దక్కితే కాంట్రాక్టర్లకు కాసుల వర్షమే. అందువల్లే వీటికి విరీతమైన పోటీ ఉంటుంది. సివిల్ సప్లయిస్ అధికారులకు పెద్దమొత్తాల్లో కమీషన్లు ఇవ్వకపోతే టెండర్ల ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు పడదు.గత ప్రభుత్వంలో చివరిసారిగా పిలిచిన టెండర్ల కాలపరిమితి 2023 ఫిబ్రవరితోనే ముగిసిపోయింది. ఎలాగైనా పాత కాంట్రాక్టర్లనే కొనసాగించాలని భావించిన అధికారులు 2023 మార్చిలో టెండర్ల నోటిఫికేషన్‌ను తప్పుల తడకగా విడుదల చేయడంతో కోర్టు స్టే ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త స్టేజ్-1 కాంట్రాక్టులకు పాత టెండరు పొడిగింపు కుదరదని స్పష్టం చేయడంతో గత ఆగస్టు 13న టెండరు నోటీసు ఇచ్చారు. ఎలాంటి కారణాలు చెప్పకుండానే అధికారులు టెండర్లను రద్దు చేసేశారు. ఆ తర్వాత మళ్లీ గతనెల 13న అన్ని జిల్లాలకూ విడివిడిగా టెండరు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 8న ఫైనాన్షియల్ బిడ్లు తెరిచారు. పాత టెండర్ల కంటే అధికంగా రేట్లు కోట్ చేశారనే కారణంతో 15 రోజులుగా వాటిని ఖరారు చేయకుండా పక్కనపెట్టారు. పాతవారినే కొనసాగించాలనే పక్కా ప్రణాళికతోనే టెండర్లను ఖరారు చేయట్లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Latest News