by Suryaa Desk | Sun, Jan 26, 2025, 08:06 PM
విజయనగరం జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, నగరంపై నిఘా పెరిగింది. ఇదివరకటిలా దొంగతనం చేసి పరారీ అయిపోవచ్చునని తలిచే వ్యక్తులకు పోలీస్ శాఖ మూడో కన్నుతో జవాబిస్తోంది. ఒక్కోసారి గంటల వ్యవధితో చోరులను పట్టేస్తోంది. ఎక్కడికక్కడే సీసీ కెమెరాలు అమర్చడంతో పాటు డ్రోన్ కెమెరాలతో నిరంతరం అన్ని ప్రాంతాలను జల్లెడ పడుతోంది. దీంతో దొంగలు, దోపిడీదారులు, అక్రమ కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులెవరైనా వేగంగా పట్టుకుని కటకటాల వెనుక బంధిస్తోంది. విజయనగరం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా మార్పు చెందాక ఏడాదికేడాది అతి త్వరగా విస్తరిస్తోంది. జనావాసాలు పెరుగుతున్నాయి. వాణిజ్య వ్యాపార కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతోంది. జిల్లాలోని ఇతర పట్టణాలూ పెరుగుతున్నాయి. అదే సమయంలో దొంగతనాలు పెరిగాయి. ప్రస్తుతం విజయనగరానికి సంబంధించి మూడు డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి. మిగతా స్టేషన్లకు సైతం పోలీస్ శాఖ డ్రోన్లను విస్తరించే పనిలో ఉంది.జిల్లా వ్యాప్తంగా అన్ని సర్కిళ్లతో పాటు నేరాలు అధికంగా నమోదయ్యే ప్రాంతాలను డ్రోన్లతో నిరంతరం పర్యవేక్షించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల అనంతపురం జిల్లా పోలీస్ శాఖ ప్రయోగాత్మకంగా చేపట్టిన డ్రోన్ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఆ జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది ఇటు ఉమ్మడి విశాఖ జిల్లాలో గంజాయి నియంత్రణకు సైతం పోలీస్ శాఖ డ్రోన్ల సాయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మన జిల్లాలో కూడా డ్రోన్ల సేవలను అందుబాటులోకి తీసుకురావాలని భావించింది. డిసెంబర్ 31తో పాటు సంక్రాంతి మూడు రోజులూ డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించింది.
Latest News