|
|
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 05:55 PM
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు రిమాండ్ పొడిగించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఫిర్యాదుదారుడు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో ఏప్రిల్ 8 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది. ఆయనతో పాటు మరో నలుగురు నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. ఏ-1 వల్లభనేని వంశీ మోహన్, ఏ-4 గంటా వీర్రాజు, ఏ-7 ఎలినేని వెంకట శివరామకృష్ణ ప్రసాద్, ఏ-8 నిమ్మల లక్ష్మీపతి, ఏ-10 వేల్పూరు వంశీలను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. దీంతో వీరికి ఏప్రిల్ 8 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి ఆదేశాలు జారీ చేశారు.విచారణ సమయంలో వంశీని న్యాయాధికారి నేరుగా పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. జైల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు న్యాయాధికారి. గతంలో అనారోగ్యం దృష్ట్యా వేసిన పిటిషన్‌లపై మంచంతో పాటు పరుపు, దిండు కూడా అనుమతిస్తూ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయనే దానిపై న్యాయాధికారి ఆరా తీయగా.. సింగిల్ బ్యారేక్‌లో ఉన్నందున ఇబ్బందిగా ఉందని, వేరే బ్యారేక్ మార్చాలని లేదా.. ఇప్పటికే తనతో పాటు రిమాండ్‌లో ఉన్న వారిలో ఒకరిని కాని ఇద్దరిని కానీ ఉంచే వెసులుబాటు కల్పించాలని న్యాయాధికారికి వంశీ విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి గతంలోనే పిటిషన్ వేసిన పరిస్థితులు, అప్పటి విచారణపై న్యాయాధికారి స్పందించారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేతగా ఉన్న నేపథ్యంలో భద్రత దృష్ట్యా వేరే వారిని వంశీతో కలిపి ఉంచలేమని జైలు అధికారులు, పోలీసులు గతంలోనే కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
Latest News