|
|
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 02:41 PM
వైసీపీ కార్యకర్త పవన్‌ను బుధవారం విచారణకు రావాలని ఆదేశిస్తూ పులివెందుల పట్టణ పోలీసులు మరోసారి 41-ఏ నోటీసులు జారీ చేశారు. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-2 వై. సునీల్‌యాదవ్ పులివెందుల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐదుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల విడుదలైన ‘హత్య’ సినిమాలో తనను, తన తల్లిని కించపరిచే విధంగా సన్నివేశాలు చిత్రీకరించారని, ఆ సినిమాలోని సన్నివేశాలను పులివెందుల వైసీపీ నాయకులు, కార్యకర్తలు వాట్సప్ గ్రూప్‌లలో వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ కార్యకర్త పవన్ కుమార్ నిర్వహిస్తున్న ‘వైఎస్ అవినాశ్ యూత్’ వాట్సాప్ గ్రూప్‌లో ‘హత్య’ సినిమాలోని సన్నివేశాలను పదే పదే వైరల్ చేస్తున్నారని గుర్తించిన పోలీసులు ఆయనను ఈ కేసులో ఏ-1గా చేర్చారు. ఇప్పటికే పోలీసులు ఆయనను రెండు రోజులు విచారించారు. మరోసారి విచారణకు రావాలంటూ గతంలోనే నోటీసులు ఇచ్చినా మంగళవారం విచారణకు హాజరు కాలేదు. దీంతో మంగళవారం మరోసారి 41-ఏ నోటీసులు జారీ చేశారు. బుధవారం పట్టణ పోలీసుస్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు. ఇదిలావుంటే, మంగళవారం విచారణకు హాజరు కాకపోవడానికి కారణం.. గత విచారణ సమయంలో పోలీసులు తనను చిత్రహింసలు పెట్టారని మాజీ సీఎం జగన్‌కి పవన్ చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ నమోదు చేసి న్యాయం జరగేలా చేస్తామని జగన్ హామీ ఇచ్చినట్టు తెలిసింది. విచారణ సందర్భంగా డీఎస్పీ, సీఐ తనను కొట్టారని, తనకు ఏపాపం తెలియదని జగన్‌కు వివరించినట్లు సమాచారం. దీనిపై జగన్ స్పందిస్తూ.. పోలీసుల చర్యను చూస్తూ ఊరుకోబోమన్నారు.
Latest News