గుడిపై హెలికాప్టర్‌తో కమెడియన్ సప్తగిరి పూలవర్షం
 

by Suryaa Desk | Wed, Mar 26, 2025, 05:55 PM

చిత్తూరు జిల్లా పుంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. మంగళవారం ప్రారంభమైన జాతర బుధవారం వరకూ జరగనుంది. జాతర సందర్భంగా స్థానికంగా ఉన్న ప్యాలెస్‌ ఆవరణ భక్తులతో నిండిపోయింది. సుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా విరూపాక్షి మారెమ్మకు దివ్వెలు, జంతుబలులతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ జాతర సందర్భంగా పొరుగున ఉన్న జిల్లాలతో పాటుగా కర్ణాటకకు చెందిన గొర్రెల పెంపకందార్లు కూడా గొర్రెలను అధిక సంఖ్యలో తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే కర్ణాటకకు చెందిన పొట్టేలును ఓ వ్యక్తి రూ.1,36,000కు కొనుగోలు చేయడం విశేషం.


మరోవైపు సుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా కమెడియన్ సప్తగిరి హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించారు. గంగమ్మ ఆలయంపై సప్తగిరి హెలికాప్టర్ ద్వారా పూలు చల్లారు. ఈ నేపథ్యంలో సుగుటూరు గంగమ్మ జాతర గురించి తెలుసుకునేందుకు నెటిజనం ఆసక్తి చూపుతున్నారు. సుగుటూరు గంగమ్మ జాతరకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. స్థానిక జమీందారులే ఇప్పటికీ ఈ జాతరను జరపడం విశేషం. విజయదశమి సందర్భంగా మైసూరు ప్యాలెస్‌లో దసరా ఉత్సవాలు నిర్వహించడం తెలిసిందే. ఆ ఉత్సవాల తర్వాత అంత ప్రాచీనమైనది సుగుటూరు గంగమ్మ జాతరనేనని ప్రసిద్ధి.ఈ విషయాన్ని ఇక్కడ ఉన్న ప్యాలెస్‌లో బ్రిటిషర్లు విజిట్‌ పుస్తకంలో రాసినట్లు చరిత్రకారులు చెప్తున్నారు.


 సుగుటూరు ఆలయ చరిత్ర


ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే.. ఈ ప్రాంతాన్ని పాలించే చిక్కతిమ్మరాయలు ఓసారి గంగమ్మ, వీరభద్ర విగ్రహాలతో సుగుటూరు నుంచి పుంగనూరు బయల్దేరారట. అయితే మధ్యలో అమ్మవారి విగ్రహ శిలలు తీసుకెళ్తున్న బండి చెడిపోయింది. దీంతో మరమ్మత్తులు చేయాల్సి రావటంతో ఆయన అక్కడే నిద్రించారట. ఆ రోజు రాత్రి కలలో అమ్మవారు కనిపించి తన విగ్రహాన్ని ఆ ప్రదేశంలోనే ప్రతిష్ఠించాలని కోరడంతో చిక్కతిమ్మరాయలు గంగమ్మ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్టించారని ప్రతీతి. ఈ నేపథ్యంలో ఆ స్థలమే కాలక్రమంలో సుగుటూరు గంగమ్మ ఆలయంగా మారిందని స్థానికులు చెప్తుంటారు. ఇక సుగుటూరు గంగమ్మ జాతర 18వ శతాబ్దం ప్రారంభంలో మొదలైందని స్థానికులు చెప్తున్నారు. అప్పట్లో పుంగనూరు జమిందారీల పాలనలో ఉండేదని.. అంతుచిక్కని వ్యాధి ప్రబలినప్పుడు సుగుటూరు గంగమ్మ ఇక్కడి ప్రజలను కాపాడిందని స్థానికులు చెప్తుంటారు. అప్పటి నుంచి జాతర జరపడం ఆనవాయితీగా మారింది.


ఇక ఈ ఆలయంలో యాదవులే పూజారులు. అలాగే బెస్త సామాజికవర్గానికి చెందిన వారు నలుగుపెట్టి గరిగెలు చెల్లించిన తర్వాతే పూజలు ప్రారంభమవుతాయి. అయితే సుగటూరు గంగమ్మ, నడివీధి గంగమ్మలకు కోపం ఎక్కువని.. అందుకే ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే జనంలోకి తెస్తారని స్థానికులు చెప్తున్నారు. మిగతా రోజుల్లో గృహ నిర్బంధంలో ఉంచుతారని ఇక్కడి ప్రజలు చెప్తున్నారు.

Latest News
Nepal name 24-player group for training camp ahead of T20 WC Mon, Dec 22, 2025, 01:24 PM
Man arrested for harassing Bengali singer not affiliated to party, claims Trinamool Congress Mon, Dec 22, 2025, 01:21 PM
BJP emerges 'Big Brother' in Maha civic polls, but MahaYuti unity key for future success Mon, Dec 22, 2025, 01:15 PM
SC stays conviction of ex-NCP minister Manikrao Kokate in Nashik housing fraud Mon, Dec 22, 2025, 01:13 PM
Gold rises to record high over strong safe haven demand Mon, Dec 22, 2025, 01:13 PM