![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 08:07 PM
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ మరోసారి సీరియస్ అయింది. గత కొంతకాలంగా ఆయన వ్యవహారశైలిపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఆయన పార్టీ సూచనలను బేఖాతరు చేస్తున్నారనే అసంతృప్తి పార్టీ అధిష్ఠానంలో నెలకొంది. ఈ నేపథ్యంలో, గట్టి హెచ్చరిక జారీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్టీ ఎంపీ, జిల్లా అధ్యక్షుడు, సమన్వయకర్తలతో కూడిన త్రిసభ్య కమిటీని వేసి, కొలికిపూడి ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువూరు నియోజకవర్గంలో గత 10 నెలలుగా జరుగుతున్న పరిణామాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అందరినీ కలుపుకొని పోవాలని, పార్టీ వేదికలపైనే సమస్యలను చర్చించాలని అధిష్ఠానం పలుమార్లు సూచించినప్పటికీ కొలికపూడి తన వైఖరిని మార్చుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ నేత రమేష్‌రెడ్డిపై చర్యలు తీసుకోకుంటే రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని కొలికపూడి చేసిన ప్రకటన మరింత వివాదాస్పదమైంది. ఇలా బాహాటంగా వ్యాఖ్యలు చేయొద్దని చెప్పినా, కొలికపూడి వినిపించుకోకపోవడం పార్టీ అధిష్ఠానాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. కొలికపూడి శ్రీనివాస్ ధిక్కార స్వరం విమర్శలకు తావిస్తోందని, ఇది పార్టీ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉందని టీడీపీ హైకమాండ్ భావిస్తోంది. ఆయన తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని పార్టీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
Latest News