|
|
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 01:07 PM
గిరిజనులను అకారణంగా ఇబ్బందులకు గురి చేస్తే సహించే ప్రసక్తే లేదని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. సాలూరులోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆమె ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈసందర్భంగా కూర్మ రాజుపేట పంచాయతీ పునికిలవలస గ్రామానికి చెందిన పలువురు గిరిజనులు వచ్చి.. తాము ఎప్పటి నుంచో సాగు చేసుకుంటూ అన్ని హక్కు పత్రాలు కలిగిఉన్నప్పటికీ తమ భూములు లాక్కోవటానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. స్పందించిన మంత్రి.. వెంటనే తహసీల్దార్ ఎన్వీ రమణను అక్కడకు రప్పించారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములను వారిని భయపెట్టి లాక్కుం దామని ప్రయత్నిస్తే సహించేది లేదని అన్నారు. మారుమూల గ్రామలకు సైతం పూర్తి స్థాయిలో రహదారులు నిర్మించాలని ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు. తమకు దూప దీప నైవేధ్యం ఖర్చులు వచ్చేలా చేయాలని, అలాగే ఆలయ కమిటీల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లాలో ఉన్న పలువురు అర్చకులు మంత్రిని కలిసి తమ సమస్యను వివరించారు. ఇలా అనేక సమస్యలపై ప్రజలు రాగా.. ఉన్నతాధికారులతో మాట్లాడి, వారి సమస్యల పరిష్కారానికి ఆమె ప్రయత్నాలు చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
Latest News