ఏపీ ఆర్థికాభివృద్ధిలో విశాఖ నగరం గుండెకాయ లాంటిద‌ని వ్యాఖ్య‌
 

by Suryaa Desk | Mon, Mar 31, 2025, 02:10 PM

"బ్రాండ్ బాబు తిరిగి వచ్చాడు దాంతోపాటు బ్రాండ్ వైజాగ్ తిరిగొచ్చింది. ఒక ప్రభుత్వంగా బ్రాండ్ వైజాగ్‌ను పునరుద్దరించాలని మేము నిశ్చయించుకున్నాం. గత 10 నెలల చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వంలో పరిశ్రమదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించి, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టగలిగాం. వ్యాపార అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించి, రాష్ట్రానికి పెద్దఎత్తున కంపెనీలను రప్పించగలిగాం" అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. విశాఖ బీచ్ రోడ్డులో తాజ్-వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో వరణ్ బే శాండ్స్ పేరిట నూతనంగా నిర్మించతలపెట్టిన కొత్త అత్యాధునిక హోటల్, ఆఫీస్ టవర్ కు మంత్రి లోకేశ్‌ తల్లి భువనేశ్వరితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ... వైజాగ్ ఎల్లప్పుడూ మా హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఈ నగరం కేవలం ఒక అందమైన తీరప్రాంతం మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాంటిది. దశాబ్ధాలుగా వైజాగ్ మాకు అండగా నిలిచింది. ప్రపంచస్థాయి పెట్టుబడి గమ్యస్థానంగా విశాఖను అభివృద్ధి చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాం. నేటి ఈ కార్యక్రమం మా దార్శనికతకు నిదర్శనం. తాజ్-వరుణ్ గ్రూప్ అధినేతలు, గౌరవనీయ పరిశ్రమ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు, ఈరోజు ఇక్కడకు వచ్చిన విశిష్ట అతిథులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. గత పాలకులు విధ్వంసక విధానాలతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, వ్యాపార వాతావరణానికి అపారమైన నష్టాన్ని కలిగించారు. అప్పటి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఎంతోమంది పెట్టుబడిదారులు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లారు. ప్రధాన ప్రాజెక్టులన్నీ నిలిచిపోయాయి. గత ప్రభుత్వ తిరోగమన విధానాలు ఆర్థిక స్తబ్దతకు దారితీశాయి. ఫలితంగా రాష్ట్రంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టాలని ప్లాన్ చేసిన లూలూ వంటి కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయ‌ని మంత్రి అన్నారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం విశాఖ ప్రజలు మాకు అండగా నిలిచారు. 2019లో రాష్ట్రమంతటా ఎదురుగాలి వీచినా విశాఖలో మమ్మల్ని ఆదరించారు. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైలులో నిర్బంధిచినప్పుడు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అన్నది మా నినాదం. వరుణ్ గ్రూప్ నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్ కేవలం విశాఖకే ఐకానిక్ కాదు, యావత్ భారతదేశానికి ఐకానిక్ గా నిలవబోతోంది. గత అయిదేళ్లలో రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలతో పాటు విశాఖప్రజలు ఎంతో ఇబ్బందిపడ్డారు. తమ అధినేత చంద్రబాబు రామతీర్థం వెళ్తుంటే డంపర్లు, టిప్పర్లు అడ్డుపెట్టారు. ఎయిర్ ఇండియా నుంచి త్వరలో రాష్ట్రానికి శుభవార్త రాబోతోంది. భారతదేశ 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో విశాఖ రీజియన్ కీలకపాత్ర వహించబోతోంది. విశాఖను ఐటీ హబ్ గా అభివృద్ధి చేసి, రాబోయే అయిదేళ్లలో యువతకు 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అన్నింటికంటే ముఖ్యమైన ఇన్ ఫ్రాస్ట్చక్చర్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నాం. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు, టూరిజం మంత్రి దుర్గేశ్‌ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో 50వేల హోటల్ రూమ్ లు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విశాఖ నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో వరల్డ్ క్లాస్ క్రికెట్ స్టేడియం ఇప్పటికే అందుబాటులో ఉంది. భోగాపురం ఎయిర్ పోర్టు త్వరలో పూర్తి కాబోతోంది. దేశంలో 5వ అతిపెద్ద ఆర్థిక నగరంగా విశాఖపట్నం అవతరించబోతోంద‌ని మంత్రి వెల్ల‌డించారు. విశాఖనగరాన్ని ఆతిథ్యం, వాణిజ్యం, ఆవిష్కరణల కేంద్రంగా మార్చే మా ప్రయాణంలో తాజ్ వరుణ్ గ్రూప్ కొత్త పెట్టుబడి మరో మైలురాయిగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ లో రూ. 500 కోట్ల సంయుక్త పెట్టుబడి రాష్ట్రానికి రానుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రీమియం హోటల్, గ్రేడ్-ఏ ఆఫీస్ బ్లాక్ రెండూ కలిగి ఉన్న ఏకైక పెట్టుబడి ఇది. ఈ పరిణామం విశాఖ నగరం స్కైలైన్‌ను పునర్నిర్వచించడమేగాక లగ్జరీ, వ్యాపారం, ఆవిష్కరణలలో కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఫేజ్-1లో 3,500 ప్రత్యక్ష ఉద్యోగాలు, అదనంగా 500 పరోక్ష ఉద్యోగాలను లభిస్తాయి. మన యువతకు జీవనోపాధి అవకాశాలు, వైజాగ్‌లో బలమైన ఆర్థిక వ్యవస్థకు పునాదికి దోహదపడుతుంది. ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక లగ్జరీ హోటల్ గా మాత్రమే కాకుండా భవిష్యత్తు ఔత్సాహికుల కోసం ఒక మంచి పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుంది. యువ పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులు స్థాపించే స్టార్టప్‌లను ఇంక్యుబేట్ చేయడానికి ఆఫీస్ టవర్ ప్రత్యేక ప్రాంతాలను కలిగి ఉంటుంది. విశాఖ మహానగరం భారతదేశ భవిష్యత్తును నిర్దేశించే కొత్తతరం కంపెనీలకు కేంద్రబిందువుగా, ఆవిష్కరణల కేంద్రంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ టెక్నాలజీ, బిజినెస్ హబ్ గా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. వేగవంతమైన పారిశ్రామికీకరణ కోసం స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడం, పరిశ్రమలు అభివృద్ధి చెందగల డైనమిక్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు మేము కట్టుబడి ఉన్నామ‌ని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ లో మేము తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి అవిశ్రాంతంగా కృషిచేస్తున్నాం. గత పది నెలల్లోనే ఆర్సెలర్ మిట్టల్, బీపీసీఎల్, టీసీఎస్, ఎన్‌టీపీసీ, ఎల్‌జీ, టాటా పవర్ వంటి అనేక ప్రధాన సంస్థలు రూ. 8 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు, 5 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించడానికి ముందుకువచ్చాయి. ఈ పెట్టుబడులు మేం నిర్మిస్తున్న ప్రగతిశీల ఆంధ్రప్రదేశ్ కు నిదర్శనం. భారతదేశ మలిదశ ఆర్థికవృద్ధికి నాయకత్వం వహించేందుకు ప్రస్తుతం ఏపీ సిద్ధంగా ఉంది. చంద్రబాబు నేతృత్వంలో చేపడుతున్న స్నేహపూర్వక, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల కారణంగా పరిశ్రమదారుల్లో నమ్మకం పెరగడమేగాక ఏపీ భవిష్యత్తుపై ఆశలు చిగురించాయి. మా ప్రభుత్వంపై నమ్మకంతో విశాఖనగరాన్ని తమ తదుపరి పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకున్న తాజ్-వరుణ్ గ్రూప్ నాయకత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మేము మా ఎన్నికల మ్యానిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని రాష్ట్రప్రజలకు ధైర్యంగా వాగ్దానం చేశాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా ప్రస్తుతం మేం అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలో సృష్టించబడే ప్రతి ప్రత్యక్ష ఉద్యోగం మరో నాలుగు పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఇది రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక పునరుజ్జీవనం కోసం మేం అనుసరిస్తున్న వ్యాపార అనుకూల విధానాలు... ఏపీని ఆవిష్కరణల కేంద్రంగా, స్థిరమైన ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తాయి. ఈ క్రమంలో విశాఖపట్నం ఏపీకి గుండెకాయగా నిలుస్తుంది. ఇది ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో విశాఖను మరింత పచ్చదనంగా, సంపన్నవంతంగా, ఎకనమిక్ పవర్ హౌస్ గా తీర్చి దిద్దేందుకు అందరం కలసికట్టుగా కృషిచేద్దామని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. హెరిటేజ్ గ్రూప్ ఎండీ నారా భువనేశ్వరి మాట్లాడుతూ వరుణ్ గ్రూప్ ఆధ్వర్యాన నిర్మితం కానున్న తాజ్‌-వరుణ్ బే శ్యాండ్స్ హోటల్ విశాఖనగరానికేగాక ఏపీకే మణిహారంగా నిలువబోతోందని తెలిపారు. వరుణ్ గ్రూప్ అధినేత ప్రభు కిశోర్ టీమ్ వర్క్ తో ఈ కొత్తప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేస్తారని అన్నారు. పదవులతో సంబంధం లేకుండా ప్రభు కిశోర్ తమ కుటుంబానికి ఎల్లవేళలా అప్యాయత కనబరుస్తూ మద్దతుగా నిలిచార‌ని, ఆయన వండర్ ఫుల్, డిసిప్లెయిన్ ఎంటర్ ప్రెన్యూర్ అని అన్నారు. ఎంతఎత్తుకు ఎదిగినా హుందాగా నిరాడంబరమైన జీవనాన్ని సాగిస్తూ సంస్థను విజయపథంలో నడిపిస్తున్నారని తెలిపారు. ప్రభు కిశోర్ విజయం వెనుక ఆయన భార్య లక్ష్మి పాత్ర కీలకమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభుకిషోర్, ఎండీ వరుణ్ దేవ్, డైరక్టర్ హర్ష, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, విశాఖ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణ, ఏసీఏ మాజీ చైర్మన్ గంగరాజు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు తదితరులు పాల్గొన్నారు.

Latest News
IPL has helped overseas players to get used to intimidating crowds in India: Nasser Hussain Mon, Jan 19, 2026, 04:44 PM
India making best investments with Ayushman Bharat, Future Health Districts programmes: Report Mon, Jan 19, 2026, 04:36 PM
PIA privatisation comes at a high moral and fiscal cost, hits taxpayers hard: Report Mon, Jan 19, 2026, 04:35 PM
Andhra CM Chandrababu Naidu meets Singapore President in Zurich Mon, Jan 19, 2026, 04:34 PM
SC directives on Bengal SIR exercise: Abhishek Banerjee says BJP's 'game is over' Mon, Jan 19, 2026, 04:31 PM