|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 08:37 PM
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై నెలకొన్న తీవ్ర అనుమానాలకు వైట్‌హౌస్ అధికారికంగా తెరదించింది. 79 ఏళ్ల వయసు కల్గిన ట్రంప్ ఆరోగ్యం 'పరిపూర్ణంగా అద్భుతంగా' ఉన్నట్లు వైట్‌హౌస్ ఫిజీషియన్, డాక్టర్ కెప్టెన్ సీన్ బార్బాబెల్లా తెలిపారు. ఎమ్ఆర్ఐ స్కానింగ్ నివేదిక చూసిన ఆయన.. ట్రంప్‌కు ఎలాంటి అనారోగ్యమూ లేదని.. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటించారు. ముఖ్యంగా డెమోక్రాట్లు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ తాజా వైద్య ఫలితాలు కీలకంగా మారాయి.
అధ్యక్షుడి గుండె బలంగా ఉంది: డాక్టర్ నివేదిక
ట్రంప్ వయసున్న వ్యక్తుల్లో సాధారణంగా కార్డియోవాస్కులర్ (గుండె), ఉదర సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున. గత అక్టోబర్‌లో ఆయనకు సమగ్రమైన ఎంఆర్‌ఐ పరీక్ష నిర్వహించినట్లు డాక్టర్ బార్బాబెల్లా వెల్లడించారు. ఈ పరీక్ష ఫలితాలను ఇప్పుడు విడుదల చేశారు. ట్రంప్ గుండె పనితీరు భేషుగ్గా ఉందని.. ధమనుల్లో రక్త ప్రసరణ ఎటువంటి వైపరీత్యాలు లేకుండా సరిగ్గా జరుగుతోందని స్పష్టం చేశారు. అధ్యక్షుడి గుండె బలంగానే ఉందని.. ఆయన కార్డియోవాస్కులర్ సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తోందని డాక్టర్ నివేదికలో పేర్కొన్నారు. ట్రంప్ గుండె, ఉదర భాగాల ఎమ్‌ఆర్ఐ ఫలితాలు సాధారణంగానే ఉన్నట్లు బార్బాబెల్లా ధృవీకరించారు. ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు ఈ నివేదిక పూర్తి విరామం ఇస్తుందని వైట్‌హౌస్ భావిస్తోంది.
డెమోక్రాట్ల డిమాండ్‌కు తాజా స్పందన
ట్రంప్ ఆరోగ్యంపై డెమోక్రాట్లు గత కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రెండోసారి దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతడి ఆరోగ్య పరిస్థితిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ.. మిన్నసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ వంటివారు ఆయన స్కాన్ నివేదికను విడుదల చేయాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. ఈ ఒత్తిడి నేపథ్యంలోనే వైట్‌హౌస్ ఫిజీషియన్ తాజా ఫలితాలను రిలీజ్ చేశారు. అక్టోబర్‌లో జరిగిన స్కానింగ్ నివేదికల గురించి ప్రస్తావించగా.. ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ప్రయాణిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకేమీ అభ్యంతరం లేదని పేర్కొన్న ట్రంప్.. తన శరీరంపై ఏ భాగానికి ఎమ్ఆర్ఐ చేశారని ఒక రిపోర్టర్ ప్రశ్నించగా... "అది దేని గురించో తెలియదు. కానీ ఎమ్‌ఆర్ఐ చేశారు. అయితే అది మాత్రం బ్రెయిన్ కోసం కాదు" అని నవ్వుతూ బదులిచ్చారు.
బ్రెయిన్ స్కాన్ అవసరం లేదని చెప్పడానికి కారణాన్ని కూడా ట్రంప్ వెల్లడించారు. తనకు ఇటీవల జ్ఞాపక శక్తి పరీక్ష నిర్వహించారని, అందులో తాను 'ఫస్ట్ వచ్చినట్లు' తెలిపారు. ఈ విధంగా ట్రంప్ తన అద్భుతమైన జ్ఞాపక శక్తిని మరోసారి చాటుకున్నారు. ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై నెలకొన్న రాజకీయ, వైద్యపరమైన సందిగ్ధతకు వైట్‌హౌస్ డాక్టర్ విడుదల చేసిన ఈ స్పష్టమైన నివేదికతో ప్రస్తుతానికి తెరపడింది.
Latest News