|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 09:01 PM
జగిత్యాల జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాఠశాల వంటగదిలో వేడిగా ఉన్న సాంబార్ గిన్నెలో ప్రమాదవశాత్తు పడిపోయిన నాలుగేళ్ల బాలుడు మొగిలి మోక్షిత్ చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడి తండ్రి మొగిలి మధుకర్ ఆ గురుకుల పాఠశాలలో వంట మనిషిగా పనిచేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లికి చెందిన మధుకర్.. గత ఏడాదిన్నరగా ఈ పాఠశాలలో పనిచేస్తూ తన భార్య శారద, కుమార్తె శ్రీ మహి, కుమారుడు మోక్షిత్‌తో కలిసి పాఠశాల ప్రాంగణంలోనే ఉన్న నివాస గృహంలో ఉంటున్నారు.
ఈ నెల 7న సాయంత్రం మధుకర్ సాంబార్ తయారీ పూర్తి చేసి ఇతర వంట పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో, మోక్షిత్ ఆడుకుంటూ వంటగదిలోకి వచ్చాడు. ప్రమాదవశాత్తు వేడిగా ఉన్న సాంబార్ గిన్నెలోకి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన మోక్షిత్‌ను కుటుంబ సభ్యులు, పాఠశాల సిబ్బంది వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. మరో విషాదకరమైన విషయం ఏమిటంటే.. ఆరోజే మోక్షిత్ పుట్టినరోజు కావడం. తండ్రి మధుకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన గురుకుల పాఠశాల సిబ్బందిని, స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
హైదరాబాద్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పటాన్‌చెరు ప్రాంతానికి చెందిన జ్యోతి (32) గ్రీన్‌హిల్స్ కాలనీలో కూరగాయల దుకాణం నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం ఆమె దుకాణం తెరవడానికి ర్యాపిడో బైక్ బుక్ చేసుకుని ఇంటి నుంచి బయలుదేరారు. మార్గమధ్యంలో వెనుకనుంచి వచ్చిన టిప్పర్.. ర్యాపిడో బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జ్యోతి, ర్యాపిడో డ్రైవర్, సాయిబాబానగర్ పాండుబస్తీకి చెందిన సురేందర్‌రెడ్డి ఇద్దరూ తీవ్ర గాయాలతో మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Latest News