|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 09:03 PM
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. నగరి తడుకు పేట దగ్గర రెండు కార్లు ఢీకొట్టుకోవడంతో ముగ్గురు చనిపోగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయినవారిలో ఇద్దరు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ పోటు కార్మికులుగా గుర్తించారు.. మరొకరు తమిళనాడుకు చెందిన వ్యక్తి. తీవ్ర గాయాలైన ముగ్గురిది కూడా తమిళనాడు. కారును అతివేగంగా నడపటంతో ప్రమాదం జరిగింది. చనిపోయినవారిలో శంకర, సంతానంగా గుర్తించారు.. వీరిద్దరు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం పోటు కార్మికులుగా పనిచేస్తున్నారు.
చెన్నై నుంచి తిరుమల వైపు వెళ్తున్న కారు, తిరుచానూరు నుంచి తిరుత్తణి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టుకోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. తిరుచానూరు అమ్మవారి ఆలయంలో పనిచేస్తున్న శంకర, సంతానం తిరుపతి నుంచి తిరుత్తణికి వెళుతున్నారు. నగరి మండలం తడుకు పేట దగ్గర ఢీకొట్టడంతో... ఇద్దరు కార్మికులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన మూడో వ్యక్తిని చెన్నైకు చెందిన అరుణ్‌గా గుర్తించారు.
మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో కూడా మరో రోడ్డు ప్రమాదం జరిగింది. పెరవలి మండలం తీపర్రు ఏటిగట్టు మలుపు దగ్గర ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటనలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.. అయితే ఘటనలో పాఠశాలలో పనిచేస్తున్న ఆయా పద్మావతి కాలికి తీవ్ర గాయం కావడంతో ఆమెను తణుకు ఆసుపత్రికి తరలించారు. తాటిపర్రులోని జ్యోతి స్కూల్‌కు చెందిన బస్సు తీపర్రు ఏటిగట్టుపై మలుపు తిప్పుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. తీవ్రంగా గాయపడిన స్కూల్ ఆయాను మెరుగైన వైద్యం కోసం ఆమెను తణుకు ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Latest News