|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 08:47 PM
గోవాలోని బిర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితుల్లో ఒకరైన నైట్‌క్లబ్ సహ యజమాని అజయ్ గుప్తా అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి చేసిన హైడ్రామా బయట పడింది. ఎలాంటి ఆరోగ్య సమస్య లేకపోయినా వెన్నునొప్పి సమస్యతో ఆసుపత్రిలో చేరినట్లు నాటకమాడిన గుప్తాను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీలో వెన్నునొప్పి డ్రామా..
అగ్నిప్రమాదం తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అజయ్ గుప్తా.. తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ఢిల్లీలోని లజ్‌పత్ నగర్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్రెయిన్ అండ్ స్పైన్ ఆస్పత్రిలో చేరాడు. తనను పోలీసులు పట్టుకోకుండా ఉండాలని.. వెన్నునొప్పి సమస్య ఉన్నట్లుగా నకిలీ ధ్రువీకరణతో ఆసుపత్రిలో ఉంటూ చికిత్స పొందుతున్నట్లు నాటకం ఆడుతున్నాడు. అయితే మూడు, నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉండి.. ఆ తర్వాత కేసు నుంచి తప్పించుకునేందుకు మరేదైనా ప్లాన్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే గోవా పోలీసులకు సహకరిస్తున్న ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఆ ప్లాన్‌ను భగ్నం చేసి.. గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. అతడిని న్యాయస్థానం ముందు హాజరు పరిచి, అనంతరం గోవాకు తరలించనున్నారు.
అగ్నిప్రమాదం జరిగిన తర్వాత.. పోలీసులు గుప్తాపై దృష్టి సారించారు. అతడు పట్టుబడకుండా ఉండేందుకు నిరంతరం తన ఫోన్ వాడకాన్ని తగ్గించి, స్థానాన్ని మారుస్తూ ఉన్నాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. కానీ ఒక రోజంతా అతడి ఫోన్ లొకేషన్ ఆస్పత్రిలోనే ఉండగా.. తాము అక్కడికి చేరుకున్నామని చెప్పారు. ఈక్రమంలోనే అతడిని చూస్తే.. నిజంగా వెన్నునొప్పి ఉన్నవాడిగా అనిపించలేదని.. ఈక్రమంలోనే తమదైన స్టైల్లో విచారంచగా అతడు కూడా దాన్ని ఒప్పుకున్నాడని చెప్పారు. ఇలా గుప్తాను అరెస్ట్ చేసిన అధికారులు ప్రస్తుతం విచారిస్తున్నారు.
ఈక్రమంలోనే తాను కేవలం స్లీపింగ్ పార్టనర్‌ని మాత్రమే అని, క్లబ్ కార్యకలాపాల్లో తన పాత్ర లేదని అజయ్ గుప్తా మీడియాకు తెలిపారు. అయితే GST పత్రాలు గుప్తా కూడా ముగ్గురు భాగస్వాముల్లో ఒకరని ధృవీకరిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే నలుగురు క్లబ్ సిబ్బందిని అరెస్ట్ చేయగా.. ఆయనది ఐదో అరెస్టు. మరోవైపు ఈ నైట్‌క్లబ్‌కు సౌరభ్ లూత్రా, గౌరవ్ లూత్రాలు కూడా యజమానులు. ప్రమాదం జరిగిన కొద్ది గంటల్లోనే లూత్రా సోదరులు థాయిలాండ్‌లోని ఫుకెట్‌కు పారిపోయినట్లు అధికారులు గుర్తించారు. వారిని వెనక్కి రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వీరికి ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీసు కూడా జారీ చేశారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.
Latest News