|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 12:01 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే చర్యల పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ పేరుతో భారీ ర్యాలీలు, ఉద్యమాలు నిర్వహించింది. ఈ నేపధ్యంలో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ భేటీలో వైయస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ లీడర్ వైవి. సుబ్బా రెడ్డి, వైయస్ఆర్‌సీపీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ మిధున్ రెడ్డి, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పిల్లి సుభాష్ చంద్ర బోస్, రాజ్యసభ ఎంపీలు మేడా రఘునాధ రెడ్డి, అయోధ్య రామి రెడ్డి, గొల్ల బాబు రావు, లోక్ సభ ఎంపీలు మద్దిల గురుమూర్తి, గుమ్మా తనూజా రాణి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనలో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు టిడిపి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, దీనివల్ల పేద, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు వైద్య విద్య అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీల భూములను తక్కువ ధరలకు ప్రైవేటు సంస్థలకు లీజ్ ఇవ్వాలనే ఆలోచనలు కూడా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని, ఇదే సమయంలో ప్రభుత్వ వైద్య సేవలలో నాణ్యత లోపించి, సామాన్య ప్రజలకు వైద్యం దూరమవుతుందని వారు పేర్కొన్నారు.
Latest News