|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:28 PM
ఆఫ్ఘనిస్థాన్ విషయంలో పాకిస్థాన్ అనుసరిస్తున్న వైఖరిపై భారత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో పాక్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు జరపడాన్ని, అమాయక మహిళలు, చిన్నారులు, క్రికెటర్లను పొట్టనబెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండించింది.ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ పర్వతనేని మాట్లాడుతూ పాకిస్థాన్ చర్యలను "ట్రేడ్ అండ్ ట్రాన్సిట్ టెర్రరిజం"గా అభివర్ణించారు. "భూపరివేష్టిత దేశమైన ఆఫ్ఘనిస్థాన్‌కు వాణిజ్య, రవాణా మార్గాలను దురుద్దేశంతో మూసివేయడం ద్వారా పాకిస్థాన్ ఆ దేశ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇది అత్యంత గర్హనీయం. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న దేశంపై ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణం" అని ఆయన అన్నారు. పాకిస్థాన్ చర్యలు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనలకు, ఐరాస చార్టర్‌కు, అంతర్జాతీయ చట్టాలకు పూర్తి విరుద్ధమని హరీశ్ స్పష్టం చేశారు. కష్టకాలంలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక బలహీన దేశంపై ఇలాంటి బెదిరింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.
Latest News