|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 07:27 PM
తత్కాల్ టికెట్ బుకింగ్ వ్యవస్థలో భారతీయ రైల్వే ఇటీవల కీలక మార్పులను అమలు చేసిన సంగతి తెలిసిందే. తత్కాల్ బుకింగ్‌లో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు ఆధార్–ఓటీపీ ధృవీకరణను తప్పనిసరి చేసింది.అంటే, తత్కాల్ టికెట్ బుక్ చేసే సమయంలో ప్రయాణికుడు తన ఆధార్ ద్వారా వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాతే టికెట్ జారీ అవుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 322 రైళ్లకు ఈ నూతన విధానం వర్తిస్తోంది. ఆన్‌లైన్ ద్వారా టికెట్ బుక్ చేసినా, రైల్వే స్టేషన్‌లోని కౌంటర్‌లో బుక్ చేసినా — అందరికీ ఆధార్ ఓటీపీ ధృవీకరణను తప్పనిసరి చేశారు. ఈ చర్యతో అక్రమాలు తగ్గి, తత్కాల్ టికెట్లు అందుబాటులో ఉండే వ్యవధి పెరిగిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో తెలిపారు.గురువారం పార్లమెంట్‌లో మాట్లాడుతూ రైల్వే మంత్రి నూతన విధానంపై వివరించారు. ఆన్‌లైన్‌లో 322 రైళ్లకు OTP వెరిఫికేషన్ అమలు చేసినట్లు, రిజర్వేషన్ కౌంటర్లలో 211 రైళ్లకు ఇదే ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పారు. త్వరలో అన్ని రైళ్లలో ఈ విధానం అమల్లోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. కొత్త వ్యవస్థతో 96 రైళ్లలో 95 శాతం వరకు ధృవీకరించిన తత్కాల్ టికెట్ లభ్యత సమయం పెరిగిందని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారి ఐడీలను గుర్తించి బ్లాక్ చేసినట్లు వెల్లడించారు. జనవరి 2025 నుంచి సుమారు 3.02 కోట్ల అనుమానాస్పద యూజర్ ఐడీలను బ్లాక్ చేశామని చెప్పారు.నిజమైన ప్రయాణికులను గుర్తించేందుకు మరియు చట్టబద్దమైన వినియోగదారులకు సులభంగా టికెట్లు దక్కేలా చేయడానికి AKAMAI వంటి యాంటీ-బాట్ సొల్యూషన్‌లను ఉపయోగిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అకౌంట్లను తిరిగి పరిశీలించి, ధృవీకరించాక నకిలీ ఐడీలను పట్టుకుని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనుమానాస్పదంగా బుక్ చేసిన పీఎన్‌ఆర్‌లపై నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌కు అనేక ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. వీరిపై కూడా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
Latest News