|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 07:46 PM
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగింపునకు గురైతే, మహిళలు వంటింటి ఆయుధాలతో తో సిద్ధంగా ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఎస్ఐఆర్ అనంతరం పేర్లు తొలగింపునకు గురైతే ఊరుకునేది లేదని ఆమె అన్నారు.ఎస్ఐఆర్ పేరుతో మీ తల్లులు, సోదరీమణుల ఓట్లను లాక్కుంటారని ఆమె హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఢిల్లీ నుంచి పోలీసులను తీసుకువచ్చి బెదిరిస్తారని ఆమె ఆరోపించారు. జాబితాలో మీ పేరు లేకపోతే మీ వంటగదిలో వాడే వస్తువులే మీ బలమని ఆమె పేర్కొన్నారు. మహిళలు ముందుండి పోరాడతారని ఆమె అన్నారు.మహిళలు బలవంతులా, బీజేపీ బలమైన పార్టీయా చూడాలనుకుంటున్నానని ఆమె వ్యాఖ్యానించారు. తాను లౌకికవాదాన్ని నమ్ముతానని ఆమె స్పష్టం చేశారు. బెంగాల్ ప్రజలను విభజించేందుకు ఎన్నికల సమయంలో బీజేపీ డబ్బులు పంచుతోందని, ఇతర రాష్ట్రాల నుంచి మనుషులను కూడా దింపుతోందని ఆమె విమర్శించారు.రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయులు ఎన్నడూ ప్రజలను విభజించేలా వ్యవహరించలేదని ఆమె అన్నారు. స్వాతంత్ర్యం కోసం బెంగాల్ ప్రజలు ప్రాణాలు త్యాగం చేశారని, ఇప్పుడు భారత పౌరులుగా మనం దానిని నిరూపించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
Latest News