|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 12:27 PM
కడప నగరపాలక సంస్థ మేయర్‌ను తొలగించిన తర్వాత మేయర్ పదవిని చేజిక్కించుకొనేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించింది. తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలని వైయస్ఆర్‌సీపీ తిప్పి కొట్టడంతో ఆ పదవి మరోమారు వైయస్ఆర్‌సీపీ సొంతమైంది. కడప మేయర్‌గా 47వ డివిజన్ వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్ పాకా సురేష్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చాక కడప మేయర్‌గా ఉన్న సురేష్‌బాబును పదవి నుంచి తప్పించింది. దీంతో గురువారం ఎన్నిక జరిగింది. కడప కార్పొరేషన్‌లో 50 మంది కార్పొరేటర్లు ఉండగా, ఇద్దరు మృతి చెందారు. టీడీపీకి ఒకే కార్పొరేటర్ ఉన్నారు. మిగతా 47 మందిలో 8 మందిని టీడీపీ ప్రలోభాలకు గురి చేసి పార్టీలో చేర్చుకుంది. మిగతా 39 మంది కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, మాజీ మంత్రి అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్‌బాబు కార్పొరేటర్లతో సమాలోచలు జరిపి, పాకా సురేష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మెజార్టీ కార్పొరేటర్ల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని ఏకాభిప్రాయంతో వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా పాకా సురేష్‌ను ఎంపిక చేశారు. వైఎస్సార్‌సీపీకి చెందిన 39 మంది సభ్యులు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అంతా ఏకాభిప్రాయంతో ఉండటంతో టీడీపీ తోక ముడిచింది. డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి మేయర్‌గా పాకా సురేష్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించగా, కార్పొరేటర్ షఫీ బలపర్చారు. దీంతో సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పీవో అదితిసింగ్ ప్రకటించారు. అనంతరం మేయర్ పాకా సురేష్ చేత కమిషనర్ మనోజ్‌రెడ్డి ప్రమాణం చేయించారు.
Latest News