|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 07:18 PM
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాతృత్వం గురించి తెలిసిందే. ఇప్పటికే చాలా సందర్భాల్లో దానాలు, విరాళాలు ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ తన దాతృత్వం చాటుకున్నారు. ప్రపంచ కప్ గెలిచిన భారత అంధ మహిళా క్రికెట్ జట్టు సభ్యులకు ఉపముఖ్యమంత్రి తన వ్యక్తిగతంగా సహాయం చేశారు. తన సొంత డబ్బులతో జట్టులోని సభ్యులకు రూ. 5 లక్షల చొప్పున, శిక్షకులకు రూ.2 లక్షల చొప్పున చెక్కులను పవన్ కళ్యాణ్ అందజేశారు
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో అంధ క్రికెటర్లను కలిశారు. ట్రైనర్స్‌తో పాటు సహాయక సిబ్బంది కూడా పవన్ కలిశారు. అంధ మహిళా క్రికెట్ జట్టుతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్.. వారు సాధించిన విజయానికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా చెక్కులు అందజేశారు. అనంతరం మహిళా క్రికెటర్లకు పట్టుచీర, శాలువాతో పాటు ప్రత్యేక జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన వస్తువుల్ని బహుమతిగా ఇచ్చారు.
ఈ సందర్భంగా అంధ మహిళా క్రికెట్‌ను ఆదరించాలని పవన్ కళ్యాణ్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించి అన్ని రకాలుగా అండగా నిలవాలన్నారు. ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు.. కెప్టెన్ దీపిక, పాంగి కరుణా కుమారి ఉండటం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారిని అల్లూరి జిల్లాకు చెందిన క్రీడాకారిని కరుణ కుమారి.. తన గ్రామ సమస్యలను ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. కాగా, జట్టు కెప్టెన్ దీపిక కూడా తమ గ్రామ సమస్యలు తెలిపారు. ఆమె సత్యసాయి జిల్లా హేమావత్ పంచాయతీ తంబలహట్టి తండాకు చెందినవారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కావాలని దీపిక విజ్ఞప్తి చేశారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు.
ఇదొక్కటే కాదు అనేక సందర్భాల్లో ప్రజలకు అండగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్.. భారీగా విరాళాలు అందజేశారు. దీనికి సంబంధించి ఓ అభిమాని చేసిన ట్వీట్ గతంలో వైరల్ అయింది. దాని ప్రకారం నంద్యాల జిల్లాలోని కొణిదెల గ్రామానికి పవన్‌కల్యాణ్ రూ.50 లక్షలు విరాళంగా అందజేశారు. తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వరదలు సంభవించిన సమయంలోనూ రెండు తెలుగు రాష్ట్రాలకూ రూ.6 కోట్లు విరాళంగా అందజేశారు. ఇలా మరెన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతో సహాయం చేసి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
Latest News