|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 07:33 PM
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎపిసోడ్ మరోసారి టీడీపీకి తలనొప్పి మారింది. తన వాట్సాప్ స్టేటస్‌లతో సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేశారు. 'నువ్వు దేనికి అధ్యక్షుడివి ??? పేకాట క్లబ్ కా ???.. పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే ...నువ్వు నిజంగా రాయల్.. కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్' అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు. తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావు టార్గెట్‌గా ఈ స్టేటస్‌లు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రాయల సుబ్బారావు చాలా కాలంగా పేకాట ఆడిస్తున్నారంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించినట్లు తెలుస్తోంది. రాయల సుబ్బారావు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వర్గమని ప్రచారం జరుగుతోంది. తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు వాట్సాప్ స్టేటస్‌ల ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది.
కొలికపూడి శ్రీనివాసరావు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గతంలో తిరువూరు బెల్ట్ షాపుల విషయంలో, స్థానిక టీడీపీ నేతల అంశంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అప్పుడే టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యేను పిలిచి మందలించింది. ఆ తర్వాత కొలికపూడి శ్రీనివాసరావు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎయిర్‌పోర్ట్‌లో కలవడం దుమారం రేపింది.. అయితే ఎమ్మెల్యే ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. పెద్దిరెడ్డి విమానాశ్రయంలో కనిపిస్తే పలకరించానని.. అంతకమించి రాజకీయ ప్రాధాన్యం లేదని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని తాను అధిష్టానం పెద్దలకు కూడా చెప్పానన్నారు. ఆ వివాదం సమసిపోయిందనుకుంటున్న సమయంలో ఇటీవల మరో వివాదానికి తెర తీశారు.. ఈసారి ఏకంగా సొంత పార్టీ ఎంపీపై ఆరోపణలు చేశారు.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరువూరు టికెట్ కోసం కేశినేని చిన్ని తన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారంటూ ఆరోపించారు. ఈ మేరకు బ్యాంక్ స్టేట్‌మెంట్ల పేరుతో సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెట్టారు. ఈ ఎపిసోడ్ కొద్దిరోజులు నడిచింది.. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీకి డ్యామేజ్ చేసేలా నేతలు వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కొలికపూడి పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరించారని అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొలికపూడిని పిలిచి వివరణ కూడా తీసుకున్న సంగతి తెలిసిందే.. కేశినేని చిన్నిని కూడా పిలిచి విచారణ చేశారు. అయితే ఆ వివాదం కూడా అంతటితో ముగిసింది అనుకున్నారు. ఇంతలో మరోసారి కొలికపూడి సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేయడం హాట్‌టాపిక్ అయ్యింది. ఇలా వరుస వివాదాలు రావడంతో.. ఈసారి టీడీపీ అధిష్టానం శ్రీనివాసరావు అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
Latest News