|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 07:21 PM
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. తనను కలిసేందుకు వచ్చేవారి సమస్యలను సావధానంగా వినే పవన్ కళ్యాణ్.. వాటి పరిష్కారానికి కూడా అంతే వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ విషయం మరోసారి నిరూపితమైంది. శుక్రవారం ఉదయం ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టు సభ్యులు పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన పవన్ కళ్యాణ్.. అంధుల మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్ జట్టుకు 84 లక్షల రూపాయల ప్రోత్సాహకాన్ని వ్యక్తిగత సంపాదన నుంచి అందించారు. క్రీడాకారిణులు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, శిక్షకులకు రూ.2 లక్షల చొప్పున అందించారు.
ఈ సందర్భంగా అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తెచ్చారు. తమ ఊరు తంబలహెట్టి రోడ్డు వేయించమని దీపిక కోరారు. దీపిక విజ్ఞప్తిపై పవన్ కళ్యాణ్ వేగంగా స్పందించారు. ఆమె మధ్యాహ్నం అడిగిన రోడ్డుకి సాయంత్రం అయ్యేసరికి అనుమతులు వచ్చేలా చర్యలు చేపట్టారు. దీపిక విజ్ఞప్తి మేరకు రోడ్లను మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సత్యసాయి జిల్లా అధికారులు దీపిక సొంతూరు.. మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలంలోని హేమవతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబలహెట్టి రోడ్లను పరిశీలించారు. హేమావతి నుంచి తంబలహెట్టి వరకూ రోడ్డు నిర్మాణానికి రూ.3.2 కోట్లు, గున్నేహళ్లి నుంచి తంబలహెట్టీ వరకూ 5 కిమీ రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు అవసరమని అంచనా రూపొందించారు. ఈ విషయం డిప్యూటీ సీఎం దృష్టికి తేగా.. వీటికి అనుమతులు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీంతో సత్యసాయి జిల్లా కలెక్టర్ పాలనాపరమైన అనుమతులు జారీ చేశారు. దీంతో ఉదయమే దీపిక సొంతూరికి రోడ్డు వేయిస్తామని మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్.. సాయంత్రానికి మాట నిలబెట్టుకున్నారు.