|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 08:14 PM
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ర్యాపిడో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళకు.. ఆ ఆటో డ్రైవర్ ఇచ్చిన హామీకి ఇప్పుడు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతోంది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆ మహిళ తన ప్రయాణాన్ని రికార్డ్ చేస్తూ.. అర్ధరాత్రి 12 గంటలకు తాను రాపిడో ఆటోలో ప్రయాణిస్తున్నానని.. తాను అక్కడ రాసిన దాన్ని చదివిన తర్వాత.. తాను నిజంగా సేఫ్‌గా ఉన్నానని అనిపిస్తోందని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. ఆ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ కావడంతో.. ఆ ఆటో డ్రైవర్‌పై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.
ఇక ఆ ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు.. తాను సురక్షితంగా ఉన్నాననే భావన కలిగిందని ఆ మహిళ తెలిపింది. ఇక ఆ నోట్‌లో.. ఆ ఆటో డ్రైవర్.. తాను కూడా ఒక తండ్రిని, సోదరుడిని అని.. ప్రయాణికుల భద్రతే తనకు ముఖ్యమని పేర్కొన్నాడు. దయచేసి సౌకర్యంగా కూర్చోండి అంటూ రాసిన ఆ నోట్‌ను ఆ మహిళ వీడియోలో చూపించింది.
ఇక ఆ వీడియోకు సోషల్ మీడియాలో దాదాపు 4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. గత నెలలో కూడా.. అర్ధరాత్రి సమయంలో బైక్ చైన్ తెగిపోయినప్పుడు.. ఒక రాపిడో డ్రైవర్ స్పందించి.. ఎలాంటి ఇబ్బంది పడకండి అని.. తాను ఇంటి వద్ద సురక్షితంగా దించుతానని భరోసా ఇచ్చి సహాయం చేసిన ఘటన కూడా నెట్టింట వైరల్ అయింది.
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆటో డ్రైవర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాను గత 20 ఏళ్లుగా బెంగళూరు నగరాన్ని చూస్తున్నానని.. ఇది అందరికీ సురక్షితమైన నగరమని ఒక నెటిజన్ పేర్కొన్నారు. వీళ్లే అసలైన నమ్మ బెంగళూరు ఆటో డ్రైవర్లు అని.. వారిపై పెద్ద బాధ్యత ఉందని మరో నెటిజన్ తెలిపారు. నన్ను నమ్మండి.. మీరు బెంగళూరులో సురక్షితంగా ఉన్నారు. స్థానిక యువకులు ఎప్పుడూ మిమ్మల్ని వేధించరు, ఇబ్బంది పెట్టరని ఇంకో నెటిజన్ వ్యాఖ్యానించారు. ఎవరైనా అలా చేస్తే.. దయచేసి వారి స్థానికతను తనిఖీ చేయండి అంటూ మరొకరు కామెంట్ చేశారు.